తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila Politics:వివాదాలతో దోస్తీ..వైఎస్ షర్మిల రాజకీయాల రూటు సరైనదేనా..?

Ys Sharmila Politics:వివాదాలతో దోస్తీ..వైఎస్ షర్మిల రాజకీయాల రూటు సరైనదేనా..?

HT Telugu Desk HT Telugu

25 April 2023, 12:39 IST

google News
    • Ys Sharmila Politics: వైఎస్‌.షర్మిల… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. ఇప్పుడు వివాదాలతో దోస్తీ చేస్తున్నారు, రాజకీయాల రాణించే మాటేమిటో కాని ఆమె వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 
జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ షర్మిలతో భర్త అనిల్
జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ షర్మిలతో భర్త అనిల్

జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ షర్మిలతో భర్త అనిల్

Ys Sharmila Politics: వైఎస్‌.షర్మిల వ్యవహార శైలి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్‌ రెడ్డి ముద్దుల తనయురాలిగా, తెలంగాణలో వైఎస్సార్‌ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో సొంత పార్టీ పెట్టుకుని పోరాడుతున్న షర్మిల సరైన దారిలోనే సాగుతున్నారా అనే సందేహం అందరిలో కలుగుతోంది. సోమవారం షర్మిల వ్యవహార శైలి, పోలీసులతో ఘర్షణ పడిన తీరు, ఆ తర్వాతి పరిణామాలతో రాజకీయంగా రావాల్సిన మైలేజీ కంటే ఎక్కువ అప్రతిష్టను ఆమె మూటగట్టుకోవాల్సి వచ్చింది.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కొన్నేళ్లుగా తెలంగాణలో రాజకీయ భవితవ్యాన్ని వెదుక్కుంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమే ఓ విచిత్రంగా రాజకీయ వర్గాలు భావించాయి. రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని, అభిమానుల్ని పోగేసి రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సమస్యలపై పోరాటం ప్రారంభించారు.

తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్ర, రాజకీయ ప్రస్థానంలో ఏ మేరకు విజయం సాధించారనేది పక్కన పెట్టడానికి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యక్ష ఎన్నికలో కూడా ఆమె పార్టీ పాల్గొనలేదు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో షర్మిల వ్యవహరిస్తున్న తీరు మిగిలిన పార్టీలను సైతం విస్తుగొలిపేలా ఉంటోంది.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న షర్మిల పలు సందర్భాల్లో అదుపు తప్పినట్లు వ్యవహరించారు. గతంలో ప్రగతి భవన్ ముట్టడిస్తానంటూ పంజాగుట్ట చౌరస్తాలో హడావుడి చేశారు. దీంతో పోలీసులు ఆమె కారులో ఉంచి ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది. అంతకు ముందు పాదయాత్ర జరుగుతుండగా తన వాహనంపై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడంతో వివాదం చెలరేగింది. ఇటీవల ప్రభుత్వంపై పోరాటానికి కలిసి రావాలంటూ కోరడానికి సిపిఎం కార్యాలయానికి వెళ్లి వారిపై విమర్శలు గుప్పించారు.

తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం సిట్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తానంటూ బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారు.. అడ్డుకుంటున్న పోలీసులపైకి వాహనం పోనివ్వాలంటూ డ్రైవర్‌ను ఉసిగొల్పారు.

షర్మిల వ్యవహారశైలి చూసిన వారెవ్వరైనా రాజకీయ నాయకులు ఇలా కూడా వ్యవహ‍రిస్తారా అనే సందేహం కలుగుతుంది. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె అనే ఏకైక అర్హతతో ఏమి చేసిన చెల్లుతుందనే భావన షర్మిలలో కనిపిస్తుందనే విమర్శ లేకపోలేదు. తాను చెప్పేది మాత్రమే చెల్లుబాటు కావాలనుకునే నైజంతో షర్మిల వెంట పెద్దగా చెప్పుకోదగిన నాయకులు ఎవరు మిగల్లేదు. ద్వితియ, తృతియ శ్రేణి నాయకులతోనే ఇప్పటికీ పార్టీని నడిపిస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తెగా, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సోదరిగానే ప్రస్తుతం ఆమెకు గుర్తింపు ఉంది. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగన్ వదిలిన బాణంగా పాదయాత్రను షర్మిల కొనసాగించారు.

ఇప్పుడు స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చుకోకుండానే వివాదాలతో దోస్తీ చేయాలనుకునే ధోరణి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలకు కారణమవుతుందని షర్మిల గ్రహించటం లేదు. తాను చేస్తున్నదే కరెక్ట్ అనే భావనలో షర్మిల ప్రస్తుతం వ్యవహరిస్తున్నారనే అపవాదు షర్మిలపై ఉంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై షర్మిల ఫిర్యాదులు చేసిన సమయంలో కూడా ఇతర కారణాలతోనే కేంద్రానికి ఫిర్యాదులు చేశారనే గుసగుసలు వినిపించాయి.

మరోవైపు తెలంగాణలో షర్మిల చేస్తున్న రాజకీయ అలజడి గురించి ఏపీలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా సోమవారం పోలీసులపై చేయి చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

షర్మిల ఏ కారణాలతో తెలంగాణలోో రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునే ప్రయత్నం చేసినా వాటిని ప్రజలు హర్షించి, స్వాగతించే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనే ఆలోచన కూడా చేయాల్సి ఉంది. షర్మిలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఆమెను బ్రతిమాలే ప్రయత్నం చేసినా మొండిగా వ్యవహరించడమే మీడియాలో కనిపించింది. దుందుడుకు వైఖరితో తనకు తాను షర్మిల చేటు చేసుకుంటుందనే వాదన వైసీపీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. షర్మిలకు ప్రస్తుతం దక్కుతున్న గౌరవం, గుర్తింపు, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని నిలుపుకునే విషయంలో ఏమరపాటుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.

ప్రజలు సంయమనం పాటించాలంటున్న విజయమ్మ….

మరోవైపు పోలీసులపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న షర్మిలను చంచల్ గూడ జైల్లో వైఎస్ విజయమ్మ పరామర్శించింది. షర్మిల అరెస్ట్ విషయంలో తెలంగాణ ప్రజలు, యువత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చిరించారు. షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని, ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుందని చెప్పారు. పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా అని ప్రశ్నించారు. షర్మిల చేయి చేసుకున్న విషయాలను పదేపదే చూపడం సరికాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్స్ కి పర్మిషన్ ఇస్తున్నారని... షర్మిలకి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని విజయలక్ష్మి ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం