తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet : కేబినెట్ విస్తరణ... నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?

Telangana Cabinet : కేబినెట్ విస్తరణ... నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?

HT Telugu Desk HT Telugu

10 February 2024, 5:30 IST

    • Telangana Cabinet Expansion 2024 : తెలంగాణ కేబినెట్ లో పలు బెర్తులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటి కోసం పలువురు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే కేబినెట్ లో నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కబోతుందనే చర్చ వినిపిస్తోంది.
తెలంగాణ కేబినెట్ 2024
తెలంగాణ కేబినెట్ 2024

తెలంగాణ కేబినెట్ 2024

Telangana Cabinet Expansion 2024: ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, తనకు మంత్రి పదవి ఖాయమని, అదీ హోం మంత్రి పదవి కావాలని, తాను హోం మంత్రిని అయితేనే.. కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపగలుగుతామని చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

ఒకే జిల్లా.. ఒకే సామాజిక వర్గం.. ఒకే కుటుంబం

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాక, గతేడాది డిసెంబరు 9వ తేదీన అధికారం చేపట్టింది. ఆరోజు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఉమ్మడి నల్గొండకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరికి ప్రధాన శాఖలైన ఆర్.అండ్.బి, సాగునీటి శాఖలు దక్కాయి. ఈ జిల్లా నుంచి 12 అసెంబ్లీ సీట్లకు గాను, కాంగ్రెస్ ఏకంగా 11 సీట్లలో గెలవడం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ సంఖ్య కీలకమైనది కనుక గుర్తింపు దక్కినట్లే భావిస్తున్నారు. మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు, ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఖాయమని ఎలా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారు. నిజంగానే ఆయన ఎన్నికల ముందు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే సమయంలో అధిష్టానం ఇలాంటి హామీ ఏమైనా ఇచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అందునా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశలు పెట్టుకోవడం వల్ల.. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి, అదీకూడా ఇప్పటికే ఒక నేతకు మంత్రి పదవి ఉన్న కుటుంబం నుంచే రెండో మంత్రి పదవి దక్కడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో ఎందుకంత ధీమా..?

అసెంబ్లీ ఎన్నికల సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరకు తనకు తానే మంత్రిత్వ శాఖను సైతం ఖరారు చేసుకున్నారు. ఏఐసీసీ నాయకత్వం నుంచి తనకు స్పష్టమైన హామీ ఉందంటూ ప్రకటిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సయమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ పై పెద్ద విమర్శలే చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఒక విధంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, తీరా సాధారణ ఎన్నికల సమయానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, ఈ ఇద్దరి నాయకుల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి దాకా సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన సందర్భం కూడా లేకపోవడాన్ని ప్రస్తావించాల్సిందే.

మరో వైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా ఒక నేత చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డి రేవంత్ శిబిరానికి దూరంగా, కాంగ్రెస్ లోని మరో శిబిరానికి దగ్గరగా ఉన్నారని చెబుతున్నారు. మంత్రి పదవి వచ్చే వరకు పెద్దగా యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదన్న భావనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. మరో వైపు భువనగిరి లోక్ సభా స్థానం నుంచి తన భార్య లక్ష్మికి టికెట్ అడగాలని తొలుత భావించినా.. అది తన మంత్రి పదవి ఎక్కడ అడ్డం వస్తుందో అన్న ఆలోచనతో.. లోక్ సభ ఎన్నికల్లో తన భార్య పోటీ చేయదని, టికెట్ అడగలేదని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. రాజగోపాల్ రెడ్డికి అమాత్యం పదవి దక్కుతుందా..? ఒక వేళ కుదరని పక్షంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ జిల్లా ప్రతినిధి )

తదుపరి వ్యాసం