Harish Rao Vs Rajagopal Reddy : అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి- కౌంటర్లు, రీకౌంటర్లతో సభలో గందరగోళం
Harish Rao Vs Rajagopal Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Harish Rao Vs Rajagopal Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు వాడీవేడిగా కొనసాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావును ఉద్దేశించి " నిన్ను కేసీఆర్,కేటీఆర్ వాడుకుని వదిలేస్తారు. కేసీఆర్ తరువాత కేటీఆర్ ఏ తప్ప నువ్వు కాదు " అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్ రావు ప్రసంగిస్తుండగా మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడంతో.." నువ్వు ఎంత కష్టపడ్డా నీకు మంత్రి పదవి రాదు రాజగోపాల్ రెడ్డి" అని హరీశ్ రావు అన్నారు.
హరీశ్ రావు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి
దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి గొడవలు సరికావని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క అన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.....రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రూ.50 కోట్లు పెట్టీ పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారని ఇదే రాజగోపాల్ రెడ్డి అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.....హరీశ్ రావు తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని కోరారు.
హరీశ్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తాం -స్పీకర్
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటే తానూ చేసుకుంటానని హరీశ్ రావు స్పష్టం చేశారు. హరీశ్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియచేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.....తమ పార్టీ సీఎంగా రేవంత్ ను ఎన్నుకున్నారని, పదేళ్లు మీరేం చేశారో చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మరో పక్క మీ బావ బామ్మర్ధుల ఎట్లా కొట్లాడారో చెప్పాలా అని హరీశ్ రావు విమర్శలు చేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్