తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Mp Ticket : తెరపైకి కొత్త పేర్లు...! ఈసారి రేణుకా చౌదరికి ఎంపీ టికెట్ దక్కేనా..?

Khammam MP Ticket : తెరపైకి కొత్త పేర్లు...! ఈసారి రేణుకా చౌదరికి ఎంపీ టికెట్ దక్కేనా..?

HT Telugu Desk HT Telugu

15 December 2023, 18:10 IST

google News
    • Khammam Congress MP Ticket: ఈసారి కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కబోతుందనే చర్చ అప్పుడే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో సత్తాను చాటింది హస్తం పార్టీ. అయితే గతంలో మాదిరిగా ఈసారి కూడా రేణుకా చౌదరికే MP టికెట్ దక్కుతుందా..? లేక కొత్త వారు తెరపైకి వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
రేణుకా చౌదరి
రేణుకా చౌదరి (Facebook)

రేణుకా చౌదరి

Khammam Lok Sabha Constituency: అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఇక పార్లమెంట్ ఎన్నికలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎవరికి టిక్కెట్లు దక్కనున్నాయన్న అంశంపై రాజకీయ చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అదృష్టం వరిస్తుందో అన్న చర్చ సాగుతోంది.

ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజకీయాలు నెరపి పార్లమెంట్ కు ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేసిన రేణుకా చౌదరికి ఈసారి ఖమ్మం టిక్కెట్ దక్కుతుందో లేదో అన్న చర్చ అందరి నోళ్ళలోనూ నానుతోంది. స్థానికేతరురాలైన రేణుక "ఖమ్మం ఆడ బిడ్డను" అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో రాజకీయం నెట్టుకొచ్చారు. కానీ తాజాగా మారిన రాజకీయ సమీకరణాల క్రమంలో ఈసారి ఆమెకు టిక్కెట్ దక్కుతుందా..? లేదా.? అన్న సందేహాలు పుడుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడంతో ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా తెరపైకి కొత్త అభ్యర్థుల పేర్లు వచ్చి చేరుతూ అనివార్యంగా ఎంపీ టిక్కెట్ కు పోటీని పెంచుతున్నాయి.

కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిదాకా..

రేణుకా చౌదరి బెంగుళూరు లోని కర్ణాటక విశ్వ విద్యాలయం నుంచి మానసిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బంజారాహిల్స్ నుంచి పోటీ చేసిన రేణుక కార్పొరేటర్‌గా గెలిచారు. 1986 నుంచి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలిగా పని చేశారు. అనంతరం1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. హెచ్.డి.దేవగౌడ ప్రభుత్వంలో రేణుక కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2004లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. కిందటిసారి 2019లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ప్రత్యర్ది నామా నాగేశ్వరరావు చేతిలో లక్షా యాభైవేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

పెరిగిన పోటీ..

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న రేణుకా చౌదరికి ఈసారి ఖమ్మం టిక్కెట్ లభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆమెకు ఖమ్మం టిక్కెట్ ను దూరం చేస్తాయన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగిన క్రమంలో ఎంపీ టిక్కెట్ కోసం ఆశావహుల సంఖ్య సైతం పెరిగింది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. అలాగే మొదటి నుంచి రేణుకకు ప్రత్యర్ధి వర్గ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో కొలువయ్యారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత రేణుక జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించింది లేదు. ఈ ఫలితంగా జిల్లాలో తనకు అనాదిగా అండగా ఉంటూ వచ్చిన కేడర్ సైతం దూరమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషించకపోవడం గమనార్హం.

తెరపైకి కొత్త పేర్లు..

సమకాలిన రాజకీయాలను అందిపుచ్చుకోలేకపోతున్న రేణుకా చౌదరి ఇక తాజా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రులుగా కొలువై జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు తమ అనుయాయులకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ నేతలకు సంబంధించిన నాయకుల పేర్లు ఖమ్మం ఎంపీ ఎన్నికల బరిలో వినిపిస్తూ ఉండటం గమనార్హం. దీంతోపాటు సొంత పార్టీలోనే రేణుకకు ప్రత్యర్థిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీలో అధిష్టానం దగ్గర కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆయనకు రేణుక సొంత గూటి రాజకీయ ప్రత్యర్ధి కావడంతో ఆమెకు టిక్కెట్ రాకుండా పావులు కదపడంలో సర్వశక్తులు ఒడ్డుతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి రేణుకా చౌదరికి టికెట్ లభించే అంశంపై నీలినీడలు అలుముకున్నాయి.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం