Renuka Chowdary : బీఆర్ఎస్ సినిమా ముగిసింది, తెరచించే రోజులు దగ్గర పడ్డాయ్- రేణుకా చౌదరి
Renuka Chowdary : ఖమ్మం జిల్లాలో ఈసారి 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వానికి యువత ఓటు హక్కుతో సమాధానం చెప్పాలన్నారు.
Renuka Chowdary : "బీఆర్ఎస్ ఒక కొత్త సినిమా.. తెలంగాణ రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన ఇక పూర్తయింది.. తెరచించే రోజులు దగ్గరికి వచ్చాయి" అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏది ఏమైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆమె జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీని తు.చ తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ప్రజలు పదేళ్లుగా మోసపోయి బీఆర్ఎస్ వలలో చిక్కుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పరీక్ష పేపర్లను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుందని, కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఉద్యోగాలు ఇవ్వలేని దుర్మార్గపు పాలనతో ప్రజలు నలిగిపోయారని తెలిపారు. అలాంటి పరిస్థితిలో వారు నిరుద్యోగులుగా మారి తల్లిదండ్రులకు భారమయ్యారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి యువత ఓటు హక్కుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.
సోనియానే మోసగించిన కేసీఆర్ కు తగిన గుణపాఠం
తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని మోసగించిన కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని రేణుకా చౌదరి అన్నారు. డబ్బు ఇతరత్రా ప్రలోభాలతో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేళ్లుగా చేసిన ప్రతి తప్పు కాంగ్రెస్ పార్టీకి బలంగా మారిందన్నారు. ప్రజలు ఇప్పుడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎంఐఎం ఎవరికి చెబితే వారికి ముస్లింలు ఓట్లేసే రోజులు పోయాయని, రాష్ట్రంలో ఇప్పుడు ముస్లిం సోదరులు కాంగ్రెస్ వైపు స్వచ్ఛందంగా మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కడుతుంటేనే కూలిపోయే నిర్మాణాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నీ బీఆర్ఎస్ నాయకుల అనుయాయులకే వచ్చాయని, నిజమైన లబ్ధిదారులు ఇంకా గుడిసెల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన ఈ సర్కారు చరిత్రను మరువద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను అందిస్తే ఈ ప్రభుత్వం వాటిని తీసేసిందన్నారు. ఉద్యోగాలు ఇతరత్రా సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుద్దన్నారు. అక్రమ కేసుల పాలైన వారు ఓటు అనే వజ్రాయుధంతో ఈ సర్కార్ కి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.