Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సరికొత్త హిస్టరీ…-mallu bhatti vikramarka created a new history in khammam ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సరికొత్త హిస్టరీ…

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సరికొత్త హిస్టరీ…

HT Telugu Desk HT Telugu
Dec 04, 2023 07:14 AM IST

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సరికొత్త హిస్టరీ సృష్టించారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి కొత్త రికార్డును సృష్టించారు.

మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్క
మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి మూడుసార్లుకు మించి గెలిచిన దాఖలాలు లేనేలేవు. దీంతో నాలుగవ సారి మధిర బరిలో నిలుచున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గెలుపుపై నీలినీడలు అలుముకోగా ఆయన నాలుగోసారి సైతం విజయం సాధించి ఔరా అనిపించారు. అది కూడా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడిన లింగాల కమల్ రాజుతోనే కావడం విశేషం.

మధిర చరిత్ర తరచి చూస్తే..

మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే 1952లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుల ఉమ్మడి పార్టీ అయిన పిడిఎఫ్ తరఫున కొండబోలు వెంకయ్య అనే కమ్యూనిస్టు నాయకుడు అక్కడ విజయం సాధించారు.

1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బొమ్మకంటి సత్యనారాయణ గెలుపొందారు. ఆ తర్వాత 1962లో 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్గినేని వెంకయ్య విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్గినేని వెంకట రావమ్మ జయ కేతనం ఎగురవేశారు.

అనంతరం 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున బండారు ప్రసాదరావు, 1983లో జరిగిన ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన శీలం సిద్ధారెడ్డి గెలుపు పొందారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆరు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే అభ్యర్థులు మాత్రం మారుతూ వచ్చారు.

ఆ తర్వాత 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీకి చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో అదే సిపిఎం పార్టీ గెలుపొందినప్పటికీ అభ్యర్థి మాత్రం మారారు. ఆ ఎన్నికల్లో సిపిఎం ఎమ్మెల్యేగా కట్టా వెంకట నరసయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో టిడిపికి చెందిన కొండబాల కోటేశ్వరరావు గెలుపొందారు.

2004లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం తరఫున కట్టా వెంకట నరసయ్య మరోసారి విజయం సాధించారు కాగా 2009 సాధారణ ఎన్నికల్లో ఆ స్థానం ఎస్సీ కేటగిరీకి కేటాయించడంతో మధిర నుంచి భట్టి విక్రమార్క కాంగ్రెస్ తరపున పోటీకి నిలిచారు. కాగా సమీప ప్రత్యర్థిగా నాడు సిపిఎం పార్టీకి చెందిన లింగాల కమల్ రాజ్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో భట్టి విక్రమార్క తొలిసారి మధిర ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అనంతరం 2014, 2018లో సైతం కమల్ రాజుపై భట్టి విక్రమార్క విజయం సాధించారు. దీంతో నాలుగోసారి గెలిచిన ఆయన మధిరలో గత హిస్టరీని తుడిచేసి సరికొత్త చరిత్రను సృష్టించారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)

Whats_app_banner