Renuka Chowdary On Sharmila : షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా? ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని- రేణుకా చౌదరి ఫైర్
Renuka Chowdary On Sharmila : కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లకు తెలంగాణ కోడలు అని గుర్తొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
Renuka Chowdary On Sharmila : తెలంగాణ కోడలు అని వైఎస్ షర్మిలకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను అన్నారు. పాలేరు నుంచి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెప్పాలన్నారు. తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా? అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పనంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో తాను కూడా అంతే అన్నారు. తాను కూడా వెళ్లి ఆంధ్రలో పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. షర్మిల ఏదైనా అడగొచ్చు, ట్యాక్స్ ఏం లేదు కదా? కానీ అడగడానికి అర్హత ఉండాలన్నారు. వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిశారంతే అన్న రేణుకా చౌదరి.. వాళ్లు ఇంకా ఏం చెప్పలేదన్నారు. షర్మిల తెలంగాణలో పోటీచేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ లో చేరికకు షర్మిల ఒక్కరే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటూ సెటైర్లు వేశారు. షర్మిల ముందుగా అమరావతి రైతుల గురించి మాట్లాడాలని సూచించారు.
షర్మిల, తుమ్మల, పొంగులేటి-పాలేరు స్థానం ఎవరిదో?
వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల దిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే షర్మిల పార్టీ విలీనాన్ని కాంగ్రెస్ లో ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం స్వాగతిస్తుంది. ఈ క్రమంలో రేణుకా చౌదరి షర్మిలపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల కాంగ్రెస్ లోకి రావడంపై రేవంత్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ కోసం పనిచేయాలని కోరాలని, తెలంగాణలో సీట్ కేటాయించవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్ చేరితే స్వాగతిస్తామన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా ఆమె తెలంగాణలో పోటీ చేసే అర్హత ఉందన్నారు. మరోవైపు షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే టికెట్ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
పాలేరు టికెట్ పై ఆసక్తి
వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల...రాష్ట్రంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఎప్పుడూ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా విమర్శలు చేస్తూ...వివాదాల్లో చిక్కుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. ఇతర పార్టీలో నేతలు కాంగ్రెస్ వైపు షిఫ్టు అయ్యారు. ఈ సమయంలోనే వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నానని, అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని షర్మిల శివకుమార్ ను కోరారు. అనంతరం షర్మిల దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యాయి. అయితే పాలేరు నుంచి పోటీ చేసేందుకు షర్మిల ఆసక్తి చూపుతున్నారు. పాలేరు స్థానానికి కాంగ్రెస్ లో డిమాండ్ ఉండడంతో అధిష్టానం ఆ సీటును షర్మిలకు కేటాయిస్తుందా? మరో చోట బరిలోకి దింపుతుందా? తెలియాల్సి ఉంది.