SIT on ORR : ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ విచారణకు రేవంత్ ఆదేశం.. అసలు ఏం జరిగింది?
20 December 2024, 9:32 IST
- SIT on ORR : తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరం గరంగా మారాయి. కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఆ వెంటనే ఓఆర్ఆర్ కాంట్రాక్టులో అవకతవకలపై సిట్ ఏర్పాటు నిర్ణయంతో టీజీ పాలిటిక్స్ హీటెక్కాయి. కేటీఆర్ కేసు విషయం పక్కనబెడితే.. అసలు ఓఆర్ఆర్ కాంట్రాక్టులో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
ఔటర్ రింగ్ రోడ్డు
ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టులో జరిగిన అవకతవకలపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన తెలంగాణ శాసనసభలో ప్రకటించారు. నగరం చుట్టు 158 కిలోమీటర్ల ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, దాని టోల్ వసూలు, నిర్వహణ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే వివాదానికి కారణం అయ్యింది.
ఇదీ కథ..
మే 2023లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్‌కు సంబంధించి 30 సంవత్సరాల టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ కాంట్రాక్టును ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్టు విలువ రూ.7,380 కోట్లు. అయితే.. అంచనా వేసిన ఆదాయం మాత్రం రూ.18,000 కోట్లు. కాంట్రాక్టు అప్పగించిన దానికంటే రూ.11 వేల కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అప్పట్లోనే కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
కాంట్రాక్ట్ విలువ, అంచనా వేసిన ఆదాయాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీంట్లో అవినీతి, ఆర్థిక దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రతిపక్ష నాయకులు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం.. సుమారు రూ.15,000 కోట్ల ఆదాయ నష్టాన్ని కలిగించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి, ఓఆర్ఆర్‌పై నియంత్రణను నిలుపుకుంటే.. రూ.15,000 కోట్ల బ్యాంకు రుణం పొందేందుకు అవకాశం ఉండేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
అసలు ట్విస్ట్..
ఓఆర్ఆర్ కాంట్రాక్టును పొందిన కొద్దికాలానికే ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. బీఆర్ఎస్ పార్టీకి రూ.25 కోట్ల విరాళం అందించిందని నివేదికలు బయటకొచ్చాయి. ఈ వ్యవహారం టెండరింగ్ ప్రక్రియపై అనుమానాలను పెంచింది. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. టెండర్ ప్రక్రియపై అనుసరించిన విధానాలు, ఫైల్ కదలికలతో సహా వివరణాత్మక నివేదికలను సమర్పించాలని ముఖ్యమంత్రి హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు.
ఆ నివేదిక సంగతి అలా ఉండగానే.. తాజాగా సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కోరితేనే సిట్ ఏర్పాటు చేశామని రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై హరీష్ రావు స్పందించారు. సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ఆ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ స్ట్రాటజీ..
బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అటు కేటీఆర్‌పై ఏసీబీ కేసు, ఇటు ఓఆర్ఆర్ వ్యవహారంపై సిట్ ఏర్పాటుతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఐఆర్బీ కేవలం బీఆర్ఎస్‌కు విరాళం మాత్రమే ఇవ్వడం కాకుండా.. ఇంకా ఏదో జరిగిందనే అనుమానాలను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. సిట్ విచారణలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.