తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet Expansion : మారుతున్న లెక్కలు..! తెలంగాణ కేబినెట్ విస్తరణలో చోటు దక్కేదెవరికి...?

Telangana Cabinet Expansion : మారుతున్న లెక్కలు..! తెలంగాణ కేబినెట్ విస్తరణలో చోటు దక్కేదెవరికి...?

23 June 2024, 15:34 IST

google News
    • Telangana Cabinet Expansion : త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుండగా…హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ముహుర్తం ఖరారు చేస్తారని తెలుస్తోంది. 
తెలంగాణ కేబినెట్ విస్తరణ
తెలంగాణ కేబినెట్ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణ

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూలై మొదటి వారంలోనే విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అడుగు ముందుపడనుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతేడాది డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఇదే రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఈ సంఖ్య 12గా ఉంది. మరో ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం పలువురు నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… కీలక నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం…. ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు రావటంతో మళ్లీ పాలనపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇదే సమయంలో పూర్తిస్థాయి కేబినెట్ టీమ్ తో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక నామినెటేడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని యోచిస్తున్నారు.

కేబినెట్ లో చోటు ఎవరికి…?

మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు కూడా వీటిని ఆశిస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా ఆయా జిల్లాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు ఉండగా… ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే విస్తరణలో కూడా సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. అయితే ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక్కడ సీన్ మారిపోయింది. కేబినెట్ రేసులో ఆయన కూడా ఉన్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే జిల్లా నుంచి మదన్ మెహన్ తో పాటు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు.

కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచి మాత్రమే ఖాతా తెరిచింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ పార్టీలో చేరారు. ఆయన సిటీ నుంచి కేబినెట్ బెర్త్ ను కోరుతున్నారు. ఆయనే కాకుండా పలువురు నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆయనకు ఖరారయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు కావటంతో…. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. దీంతో విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన నేతకు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది…!

తదుపరి వ్యాసం