చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
CM Revanth Reddy Latest News : ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బసవతారకం ఆస్పత్రి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… ప్రభుత్వం తరపున బసవతారకం ఆస్పత్రికి పూర్తి సాకారం అందిస్తామని చెప్పారు.
CM Revanth Reddy Latest News : హైదరాబాద్ లోని బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… వైద్యారోగ్య సేవలో బసవతారకం లక్షలాది మందికి సేవలందిస్తోందని కొనియాడారు. తమ ప్రభుత్వం తరపున బసవతారకం ఆస్పత్రికి పూర్తి సాకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
పోటీపడే ఛాన్స్ వచ్చింది - సీఎం రేవంత్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని అన్నారు. “గతంలో తాను రోజుకు 12 గంటలు పని చేస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు రోజుకూ 18 గంటలు పని చేస్తారు. ఆయన 18 గంటలు పనిచేసినప్పుడు.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. నాతో పాటు మా అధికారుల టీమ్ కూడా 18 గంటలు చేయాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుతో పోటీ పడే అవకాశం నాకు దక్కింది. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి” అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఈ దేశ జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టింది నందమూరి తారకరామరావే అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇదే సమయంలో పేదల కోసం రూ.2 కేజీ బియ్యంతో పాటు ఉచిత వైద్య వంటి అనేక సేవలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. బాలయ్య బాబు సినిమాలను చూసుకుంటారని… నారా లోకేశ్, భరత్ ఇద్దరూ కూడా రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలను చూసుకోవాలని కోరారు. వారసత్వం అంటే కేవలం రాజకీయం మాత్రమే కాదని… పెద్దలు స్థాపించిన సేవ కార్యక్రమాలను కూడా కొనసాగించటం కూడా చేయాలని వ్యాఖ్యానించారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ…. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శమన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని కోరగా… వెంటనే అంగీకరించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడుతో పాటు పలువురు హాజరయ్యారు.