మీకోసమే బ్లాక్ బుక్ రెడీ చేశా, అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నాం - BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్
BRS MLA Padi Koushik Reddy Comments : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారుల పేర్లను బ్లాక్ బుక్ లో రిజిస్టర్ చేస్తున్నామని అన్నారు.
BRS MLA Padi Koushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు నడుచుకోవటం లేదని… ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. కొందరి మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు నడుచుకుంటూ… స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు చెప్పకుండానే కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు.
అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారో వారి పేర్లను బ్లాక్ బుక్ లో నమోదు చేస్తున్నానని చెప్పారు. అలాంటి వారికోసమే బ్లాక్ బుక్ సిద్ధం చేశానని హెచ్చరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని…మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
"రూల్స్ ప్రకారం ముందుకెళ్లండి. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టారాజ్యాంగా వ్యవహరించే అధికారులను హెచ్చరిస్తున్నాను. మీలాంటి వాళ్ల కోసమే బ్లాక్ బుక్ ను సిద్ధం చేశా. ఇందులో పేర్లు రిజిస్టర్ చేస్తున్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.మా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డేస్ ఉంటాయి" అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడని గుర్తు చేశారు. కానీ పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ మోసాలను గమిస్తున్నారని అన్నారు. ఇక బూడిద అక్రమ రవాణాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
బుధవారం 11 గంటలకు జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపెల్ దగ్గరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలి అని సవాల్ విసిరారు. ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారని పునరుద్ఘాటించారు. ఏ తప్పు చేయకపోతే దేవుడిపై ప్రమాణం చేయాలన్నారు. పొన్నం అవినీతి చేశాడని తాను ప్రమాణం చేస్తామని చెప్పారు. తమతో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెంట వస్తారని అన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఒకరిద్దరు ఎంఎల్ఏ లు పోతే పార్టీకి వచ్చే నష్టం ఏం లేదన్నారు. గతంలో కూడా ఇలా జరిగిందని.. అయినప్పటికీ బీఆర్ఎస్ నిలబడి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ను మోసం చేస్తున్న ఏ ఒకర్ని వదలిపెట్టామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లేకపోతే ఎవరూ గెలిచేవారు కాదని… కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఆయన బొమ్మపైనే గెలిచామని వ్యాఖ్యానించారు. పార్టీ మారే ఆలోచన ఉన్నవారు పునరాలోచన చేయాలని కోరారు. అలాంటింది ఉంటే విరమించుకోవాలంటూ సున్నితంగా హెచ్చరించారు.