Bandi Sanjay : కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుంది.. ఇబ్రహీంపట్నం పేరు మారుస్తాం
Bandi Sanjay Comments On KCR : సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే.. నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేసి.. కొత్త సచివాలయంలో కూర్చొబెట్టాలన్నారు.
బీజేపీ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yatra) ముగింపు సభను రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt)పై విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసిపోయిందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చిన పార్టీ దళితుల్ని ఎలా మోసం చేసిందని అడిగారు. పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీఛార్జ్ చేయించిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు.
దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్(KCR) మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టింది బీజేపీ(BJP) అని అన్నారు. అంబేడ్కర్ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా పంచ తీర్ధాలను ఏర్పాటు చేసిందన్నారు. ఒవైసీకి ఎప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలే కనబడుతున్నారన్నారు. మజ్లిస్‌ను కలుపుకొని రా కేసీఆర్ బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధమని సవాల్ విసిరారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాలను రద్దు చేయం. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. మునుగోడు(Munugode)లో బీజేపీ గెలవడమే లక్ష్యం. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తాం. మేం అధికారంలోకి వస్తే ఇబ్రహీంపట్నం పేరును వీర పట్నంగా మారుస్తాం.
- బండి సంజయ్
ఈ సభకు కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అథితిగా వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో పరివర్తన వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిజంగా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి.
ట్విటర్ పిట్ట కేటీఆర్(KTR) చిలక పలుకులు పలుకుతున్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రూ.36లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేసింది యూపీ సీఎం అని చెప్పారు. కేసీఆర్ కుటుంబం(KCR Family)లో అందరికీ పదవులే ఉన్నాయన్నారు. వరుణుడి కరుణతో తెలంగాణలో పంటలు బాగా పండాయని చెప్పారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ లాగే మునుగోడులోనూ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీని గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) అన్నారు.
సంబంధిత కథనం