ACB Raids on RTA Offices : రాష్ట్రంలో పలు ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు- ఏజెంట్ల వద్ద భారీగా నగదు, డాక్యుమెంట్స్స్వాధీనం
28 May 2024, 16:05 IST
- ACB Raids on RTA Offices : అవినీతి అధికారులకు ఏసీబీ ముచ్చెమటలు పట్టిస్తుంది. తాజాగాలు పలు జిల్లాల్లో ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయల్లో ఏజెంట్లు, వారి మధ్య పెద్ద మొత్తంలో లెక్కల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు
ACB Raids on RTA Offices : తెలంగాణలో పలు చోట్ల ఆర్టీఏ కార్యాలయాలు, చెక్ పోస్ట్ లలో ఏక కాలంలో ఏసీబీ అధికారలు తనిఖీలు చేస్తున్నారు. అధికారుల అక్రమ వసూళ్ల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ఆర్టీఏ ఆఫీసులు అక్రమాలకు అడ్డాగా మారాయి. ఏజెంట్ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొనగా, పైసలిస్తే ఏపనైనా ఈజీగా చేసేసే సిబ్బంది, అధికారులున్నారు. దీంతో అవినీతి నిరోధక శాఖకు పెద్ద సంఖ్యలో కంప్లైట్స్ అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలోని సిబ్బంది మధ్యాహ్నం సమయంలో మామూలు వ్యక్తులుగా ఆఫీస్ లోకి ఎంటర్ కాగా, అక్కడి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఫీస్ వెలుపలే ఉండాల్సిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్లు దర్జాగా ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యి కార్యకలాపాలు చక్కబెట్టడం చూసి అవాక్కయ్యారు. ఈ మేరకు ఆఫీస్లో వివిధ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, లైసెన్స్ అప్లికేషన్లు, డబ్బుతో ఉన్న ఆరుగురు ఏజెంట్లు, ఆఫీస్ లో లెక్కల్లో లేని డబ్బు పట్టుకుని ఉన్న డీటీవో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒక్కసారిగా ఏసీబీ సోదాలతో ఆఫీసులో కలకలం లేవగా, అధికారుల కదలికలను పసి గట్టిన కొందరు ఏజెంట్లు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.
ఏజెంట్ల నుంచి సిబ్బంది దాకా అందరి చేతిలో డబ్బే
ఆరుగురు ఏజెంట్లతో పాటు డీటీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు ప్రాథమిక వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో కొద్దిరోజులుగా అవకతవలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దీంతోనే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఆఫీస్ లోపల ఉన్న ఆరుగురు ఏజెంట్ల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్లు, లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లతో పాటు డబ్బులు కూడా ఉన్నాయన్నారు. ఆ ఆరుగురు ఏజెంట్ల వద్ద రూ.45,100, డీటీవో డ్రైవర్ సుబ్బారావు వద్ద రూ.16,500 నగదు లభ్యమైనట్లు తెలిపారు. వారితో పాటు కౌంటర్లలో పని చేసే సిబ్బంది వద్ద కూడా నగదు లభ్యమైందని, దానిపైనా విచారణ జరుపుతున్నామని డీఎస్పీ సాంబయ్య పేర్కొన్నారు. డీటీవో డ్రైవర్ వద్ద కొన్ని బండ్ల పేపర్లతో పాటు కీస్ కూడా ఉన్నాయని, వాటి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.
మిగతా జిల్లాల్లో అలర్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఏసీబీ దాడులు జరగగా.. మిగతా జిల్లాల ఆఫీసుల్లో కూడా కంగారు మొదలైంది. మహబూబాబాద్ సమాచారం తెలిసిన వెంటనే కొంతమంది అధికారులు అప్రమత్తమై ప్రైవేటు ఏజెంట్లను అక్కడి నుంచి పంపించేశారు. వాస్తవానికి ఆర్టీఏ ఆఫీసుల్లో ప్రతి పని పైసాతో ముడిపడిన అంశమే కాగా, ఏజెంట్లు వాహనదారులను పెద్ద మొత్తంలో దోచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతోనే జనాల్లో కూడా ఆర్టీఏ ఆఫీసులంటే ఏజెంట్ ఉండాల్సిందేననే అభిప్రాయానికి వచ్చారు. కాగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల వ్యవస్థను నిర్మూలించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)