Mahabubabad Crime : మంత్రాల నెపంతో దంపతులపై దాడి, మహబూబాబాద్ జిల్లాలో తరచూ దారుణాలు!
Mahabubabad Crime : మహబూబాబాద్ లో మంత్రాల నెపంతో భార్యభర్తలపై దాడికి పాల్పడ్డారు. మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో రెండు కటుంబల మధ్య వైరం తారాస్థాయికి చేరి దాడులకు పాల్పడ్డారు.
Mahabubabad Crime : మహబూబాబాద్ లో మంత్రాల నెపం జనాల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో ఇదివరకు మంత్రాలు చేస్తున్నారన్న ఆరోపణతో దాడులు చేయగా.. తాజాగా మరోదాడి జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వేలుబల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలుబల్లి గ్రామానికి చెందిన సింగం యుగంధర్ కుటంబానికి తమ బంధువులైన ముర్రి లక్ష్మీ నర్సు కుటుంబానికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. యుగంధర్ మంత్రాలు చేస్తున్నాడనే ఆరోపణలో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తగా.. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముర్రి లక్ష్మీ నర్సు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి యుగంధర్ తో పాటు అతని భార్య రాధికపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో విపరీతంగా దాడి చేయడంతో యుగంధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరుగుతుండటంతో గమనించిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత బాధితులు కొత్తగూడ పోలీస్ స్టేషన్ లో ముర్రి లక్ష్మీ నర్సు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవలే తల్లీకొడుకుల మర్డర్
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొద్ది రోజుల కిందటే మహబూబాబాద్ జిల్లాలో తల్లీకొడుకులను పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 10న మహబూబాబాద్ జిల్లా గూడూరు బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరగగా.. స్థానికంగా తీవ్ర భయాందోళనను రేపింది. గూడూరు మండలంలోని బొల్లెపెల్లికి చెందిన శివరాత్రి కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడం, పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదనే ఉద్దేశంతో తన కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఆలకుంట కొమురయ్య, సమ్మక్క(55), కుటుంబసభ్యులు మంత్రాలు చేశారని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో కొంతకాలంగా వారి కుటుంబంతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో కొమురయ్య కుటుంబ సభ్యులు గ్రామ పెద్ద మనుషులను ఆశ్రయించగా.. పలుమార్లు ఇరువురి మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. ఇద్దరికీ పెద్ద మనుషులు సర్ది చెప్పి పంపించారు. ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగగా.. గూడూరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 8న కొమురయ్య కొడుకు సమ్మయ్య(40) కూతురు ఎంగేజ్మెంట్ ఉండటంతో పోలీసులు కేసును సోమవారం తర్వాత చూస్తామని చెప్పి పంపించారు. దీంతో ఫిబ్రవరి 10న ఉదయం 11 గంటల సుమారులో కొమురయ్య, సమ్మక్క, వారి కొడుకు సమ్మయ్య, శివరాత్రి కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తూ బస్టాండ్ సమీపంలో గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆటో డ్రైవర్ కుమార్ కోపంతో రగిలిపోయాడు. అదే కోపంలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ఆటోలోని ఐరన్ రాడ్ తో సమ్మక్క తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న ఆమె కొడుకు సమ్మయ్య, భర్త కొమురయ్య అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిపైనా రాడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి సమ్మక్క, కొడుకు సమ్మయ్య ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. కొమురయ్య కాలు, చేయి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.
తరచూ ఇవే ఘటనలు
మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రాల నెపంతో దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఇలా మంత్రాల చేస్తున్నారన్న అనుమానాలతో ఎదుటి వారిపై దాడులకు పాల్పడుతుండగా.. జనాలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా సరైన అవగాహన లేక ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్తగూడ, గూడూరు మండలాల్లోని గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఎంతోమంది అమాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుని, ప్రజలను అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)