ACB In Bhainsa: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ కమిషనర్
23 May 2024, 5:50 IST
- ACB In Bhainsa: ఇంటి నిర్మాణానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ భైంసా మునిసిపల్ కమిషనర్ ఏసీబీకి దొరికిపోయారు. స్వయంగా మునిసిపల్ కమిషనర్‌ను ఏసీబీకి చిక్కడం కలకలం సృష్టించింది.
ఏసీబీకి చిక్కిన బైంసా మునిసిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
ACB In Bhainsa: ఇంటి నిర్మాణానానికి అనుమతులు మంజూరు చేయడానికి రూ. 30వేలు లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా భైంసా మునిసిపల్ కమిషనర్ ఏసీబీకి దొరికిపోయారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లా భైంసా పురపాలక సంఘం కమిషనర్, పురాన బజార్ బిల్ కలెక్టర్ లు బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్ లో నివాసం ఉండే రైతు లాలా రాదేశ్యామ్ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది, కమీషనర్ లు ఇద్దరు కలిసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయమై నేరుగా అధికారులను కలిసినప్పుడు రూ.30 వేలు ఇస్తే ఇంటి నిర్మాణ అనుమతులు తదితర విషయాలని ధృవీకరించి తగిన విధంగా అధికారిక గుర్తింపు పత్రాలు ఇస్తామని బిల్ కలెక్టర్ ద్వారా సమాచారం అందించారు.
బుధవారం సాయంత్రం రూ.30 వేలు అందించేందుకు బాధితుడు పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ తో సంప్రదింపులు జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు బాధితుడు లాలా రాధేశ్యాం ఇచ్చిన పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు.
నగదు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 30 వేల నగదును స్వాధీనపరుచుకున్నారు. బాధితుడు లాలా రాధేశ్యాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్ లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డిఎస్పి వివి రమణ మూర్తి తెలిపారు.
(రిపోర్టింగ్ కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్)