Nekkonda Falooda: ఐస్క్రీమ్లో మూత్రం, వీర్యం! వరంగల్ జిల్లా నెక్కొండలో దారుణం.. నిందితుడి అరెస్ట్
Nekkonda Falooda: రోడ్డు పక్కన తోపుడు బళ్లపై ఐస్క్రీమ్ తింటున్నారా, జర జాగ్రత్త… చూడగానే కడుపులో తిప్పేసే దారుణం వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.
Nekkonda Falooda: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. జనాలకు అమ్మే ఐస్ క్రీమ్స్ లో ఓ తోపుడు బండి వ్యాపారి మూత్రంతో పాటు వీర్యం కలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఎండాకాలం వచ్చేసింది. ఫ్రూట్ జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లకు మస్తు డిమాండ్ ఉంటుంది. జనాల్లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కొందరు ఐస్ క్రీమ్, ఫ్రూట్ జ్యూస్ వ్యాపారులు శుభ్రత లేని నీళ్లు, వ్యర్థపు నీటితో చేసిన ఐస్, టెస్ట్ కోసం కెమికల్స్ కలపడం లాంటి ఘటనలు ఇదివరకు చాలా బయట పడ్డాయి.
తాజాగా వరంగల్ జిల్లాలో అతి జుగుప్సా కరమైన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ చేసే ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం కలపడం కలకలం సృష్టిస్తోంది. వింటేనే వాంతులు వచ్చే దారుణమైన ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ ల్ జరగగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
దీంతో పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నెక్కొండ మండల చుట్టుపక్కలా బాలాజీ కంపెనీ పేరుతో కొంతకాలంగా ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ నడుస్తోంది.
కొందరు మండల కేంద్రంలో, మరికొందరు చుట్టూ పక్కల గ్రామాలు తిరుగుతూ ఫలుదా ఐస్ క్రీమ్స్, జ్యూస్ లు అమ్ముతున్నారు. కాగా నెక్కొండ మండల కేంద్రంలో అంబెడ్కర్ సెంటర్ వద్ద ఫలుదా, కుల్ఫీ అమ్ముతున్న రాజస్థాన్ కి చెందిన రామ్ అనే ఓ వ్యక్తి దారుణమైన పని చేశాడు.
మిట్ట మధ్యాహ్నం జనాలు రాకపోకలు సాగిస్తుండగానే వికృత చేష్ట కు పాల్పడ్డాడు. ఐస్ క్రీమ్ అమ్మే బండి వద్దే హస్త ప్రయోగం చేసి, జనాలకు అమ్మే ఐస్ క్రీమ్, జ్యూస్ లలో వీర్యం, మూత్రం కలిపాడు. ఆ వ్యక్తి అంతటి దారుణానికి ఒడిగట్టగా.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి కిరాతకమైన ఈ ఘటనను వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ అయింది.
పోలీసుల అదుపులో నిందితుడు
ఫలుదా ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం కలుపుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొందరు సామాజిక కార్యకర్తల వివిధ సోషల్ మీడియా వేదికల్లో అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ, పోలీస్ అధికారులు మంగళవారం సాయంత్రం నెక్కొండలోని ఫలుదా బిజినెస్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం కలిపి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన ఫ్రూట్ సలాడ్ లని పరిశీలించి, వాటిని పారబోశారు. అంతేగాకుండా అక్కడ మరికొందరు వ్యాపారుల తయారీ కేంద్రాల్లో సోదాలు చేశారు.
ఇందులో అనుమానం కలిగిన మరికొందరి సెంటర్ లలోనూ తనిఖీలు చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. ఐస్ క్రీమ్స్, ఫలుదా, కుల్ఫీ జోలికి వెళ్లాలంటేనే జనాలు జంకే పరిస్థితులు నెలకొన్నాయి
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం