Kodangal : పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. కొడంగల్‌లో టెన్షన్ వాతావరణం
21 November 2024, 10:04 IST
- Kodangal : వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై వాదనలు ముగిశాయి. ఇవాళ కొడంగల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
పట్నం నరేందర్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుంది. నరేందర్ రెడ్డిని లగచర్ల ఘటనలో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కస్టడీ అవసరం లేదని అడ్వొకేట్ లక్ష్మణ్ వాదించారు. కుట్ర కోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ వాదించారు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇవాళ కొడంగల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
అటు తెలంగాణ హైకోర్టు కూడా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని.. పారిపోయే అవకాశం లేదని.. అలాంటప్పుడు ఇంటివద్ద ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఉగ్రవాదిలాగా భావించి పార్కులో అరెస్టు చేశారా.. అని ప్రశ్నించింది. అరెస్టులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేసినట్లు లేదని అసహనం వ్యక్తం చేసింది.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో పోలీసులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు జారీ చేసిన డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. పార్కులో వాకింగ్‌కు వెళ్లినపుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు.
లగచర్లలో రైతుల దాడిలో అధికారులకు తీవ్ర గాయాలైనట్లు మెడికల్ రిపోర్టు లేదని.. నరేందర్ రెడ్డి తరఫు లాయర్ వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ను పోలీసులు ఇంటి వద్దనే అరెస్టు చేశారని స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి రైతులకు ఫోన్లుచేసి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పారన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంటివద్ద అరెస్టు చేస్తే భార్య, బంధువులకు అరెస్టు సమాచారం ఇవ్వకుండా మూడోవ్యక్తికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
నరేందర్ రెడ్డిని పార్కులో అరెస్టు చేసినట్లు తమవద్ద వీడియోలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. కాల్ డేటాను పరిశీలిస్తే ఒకటి రెండు కాల్స్‌ను ఆధారంగా తీసుకుని కుట్ర అని ఎలా అంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు. డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టులో పలు ప్రశ్నలు ఉన్నాయని స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డిని కేసులో చేర్చడానికి ఆధారమైన లక్ష్మయ్య తోపాటు మరో ఇద్దరి వాంగ్మూలాలను సమర్పించాలని ఆదేశించారు.