Kasthuri Arrest: నటి కస్తూరి అరెస్ట్, చెన్నై పోలీసులు కళ్లుగప్పి హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతూ దొరికిన నటి
Actress Kasthuri Arrest: అరెస్ట్ భయంతో చెన్నై పోలీసులు కళ్లుగప్పి హైదరాబాద్‌కి పారిపోయి వచ్చేసిన నటి కస్తూరిని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు వారిపై నోరుజారిన ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.
తెలుగు వారిపై చెన్నైలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. ఆమెపై చెన్నైలో పలు కేసులు నమోదవగా.. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్‌కి వచ్చి ఆశ్రయం పొందుతున్న ఆమెని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
ఏంటి కస్తూరి వివాదం?
నవంబరు 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందట రాజు గారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని.. వాళ్లు ఇప్పుడు తాము తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కస్తూరి చెప్పుకొచ్చారు.
వ్యాఖ్యలు వెనక్కి.. క్షమాపణలు
తెలుగు వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. రోజుల వ్యవధిలోనే క్షమాపణలు చెప్పారు. అంతేకాదు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా కస్తూరి చెప్పుకొచ్చారు. కానీ.. అప్పటికే ఆమెపై తమిళనాడులో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వరుసగా కేసులు నమోదు కావడంతో.. అరెస్ట్ భయంతో కస్తూరి పరారయ్యారు.
ముందస్తు బెయిల్‌కి నో
కేసులు, అరెస్ట్ భయంతో నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యల తీవ్రత కారణంగా బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. దాంతో కస్తూరి అరెస్ట్ అనివార్యమైంది. హైదరాబాద్‌లో ఈ నటికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాల్ని చెప్పేందుకు చెన్నై పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది.