MLC Kavitha: కవితపై న్యాయమూర్తి ఆగ్రహం, మీడియాతో మాట్లాడొద్దని వార్నింగ్… విచారణకు సహకరించలేదన్న సిబిఐ…
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పడం లేదు. ఈడీ కేసులో రిమాండ్‌లో ఉన్న కవితకు తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించారు.
MLC Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై న్యాయమూర్తి కావేరి బావేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ Delhi liquor policy అక్రమాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. గత వారం తీహార్ జైల్లో ఈడీ కేసుల్లో అరెస్టులో ఉన్న కవితను సిబిఐ CBI నమోదు చేసిన కేసుల్లో కూడా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. సోమవారం ఆమెను కోర్టులో హాజరు పరిచారు. CBI కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు.
సిబిఐ విచారణలో కవిత తమకు సహకరించ లేదని సిబిఐ న్యాయవాదులు కోర్టులో న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కవిత మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి కావేరి బవేజా దృష్టికి సిబిఐ తీసుకురావడంతో, న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించారు.
ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనతో పాటు జోన్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుల్లో కవిత రిమాండ్‌లో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో BRS నాయకురాలు K. కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కవితను తీహార్ జైలుకు పంపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమె కూడా ఒకరని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన కేసులో కవిత ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసులో కవిత "కీలక కుట్రదారుల్లో ఒకరని సిబిఐ ఆరోపిస్తోంది. మూడు రోజుల పోలీసు కస్టడీలో ఆమెను విచారించినా, ఆమె సహకరించలేదని, సాక్ష్యాధారాలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేలా జవాబిచ్చారని ఆరోపించారు. కవిత నుంచి నిజాలు రాబట్టడానికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోరింది.
ప్రస్తుత దశలో తదుపరి కస్టడీ విచారణ అవసరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడంతో, కేసును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని సిబిఐ కోర్టుకు వివరించింది. గతంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి పలు ప్రయత్నాలు చేశారని, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా, దీపక్ నగర్ సీబీఐ సమర్పణలను వ్యతిరేకిస్తూ, సీబీఐ సహకరించకపోవడాన్ని సాకుగా చూపించి జ్యుడీషియల్ కస్టడీకి తరలించే అవకాశం లేదని వాదించారు.
ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి రూపొందించిన మద్యం విధానంలో కవిత ద్వారా రూ.100కోట్ల ముడుపులు చెల్లించినట్టు ఈడీ, సిబిఐలు ఆరోపిస్తున్నాయి. ముడుపులు చెల్లించడంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య వ్యక్తులలో కవిత ఒకరు అని గత శుక్రవారం విచారణలో CBI ఆరోపించింది.
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని బృందంతో సంప్రదింపులు జరిపారని, ముడుపుల్ని తిరిగి పొందడం కోసం రూపొందించిన స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఇండోస్పిరిట్స్ కంపెనీలో ఆమె భాగస్వామిగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది.
ఏప్రిల్ 6వ తేదీన తీహార్ జైలులో ఉన్న కవితను కోర్టు అనుమతి పొందిన తర్వాత సీబీఐ విచారించింది. సిబిఐ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని, సాక్ష్యాలను చూపించినా తప్పించుకునే సమాధానాలు ఇచ్చిందని తాజా విచారణలో ఆరోపించారు.
మనీలాండరింగ్ కేసులో 46 ఏళ్ల కవితను మొదట మార్చి 15న ED అరెస్టు చేసింది మార్చి 26న జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అక్రమాలకు సంబంధించి ED కూడా ఆమెను కీలక వ్యక్తిగా పేర్కొంది.
కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌లతో సహా ఈ కేసులో అరెస్టయిన నలుగురు ప్రముఖుల్లో ఆమె ఒకరు. నలుగురిలో, కేజ్రీవాల్ మరియు సింగ్‌లను సిబిఐ అరెస్టు చేయలేదు. వారిని ఈడీ మాత్రమే అరెస్టు చేసింది.గత వారం, కోర్టు తన మైనర్ కుమారుడి పరీక్షను ఉటంకిస్తూ, ఆమె చేసిన మధ్యంతర బెయిల్ దరఖాస్తును కూడా స్పెషల్ కోర్టు కొట్టివేసింది.
సంబంధిత కథనం