Praneeth Rao Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు - ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్ట్, రిమాండ్ విధింపు
24 March 2024, 11:41 IST
- Praneeth Rao Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రణీత్ రావు మాత్రమే తెరపైకి రాగా… తాజాగా మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్
Praneeth Rao Phone Tapping Case: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరి కూపీ లాగుతోంది సిట్ బృందం. ఇప్పటికే SIB డీఎస్పీ ప్రణీత్ రావును(Praneeth Rao) అరెస్ట్ చేయగా… తాజాగా మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది సిట్. ఇందులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న ఉన్నారు. శనివారం వీరిని అరెస్ట్ చేయగా.. ఇవాళ వీరిని న్యాయమూర్తి ఎదుటు హాజరుపర్చారు పోలీసులు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌లకు(Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరి అధికారుల ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వారి పాత్ర నిర్ధారించుకున్న అనంతరం శనివారం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు గుర్తించటమే కాకుండా… అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని సిట్ పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన తిరుపతన్న ఎస్‌ఐబీ(SIB)లో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇక భుజంగరావు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశారు. వీరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యం కావటంతో వీరిని అరెస్ట్ చేసింది ప్రత్యేక పోలీసుల బృందం. మరోవైపు ప్రణీత్ రావు… కస్టడీలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత స్పీడ్ పెంచింది సిట్. ఈ ఇద్దరిని కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరి పాత్రకు సంబంధించి కూడా ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఓ మీడియా ఛానెల్ కు చెందిన నిర్వహకుడిగా ఉన్న శ్రవణ్ రావు ఇంట్లో కూడా సోదాలు చేపట్టింది సిట్. కీలక పత్రాలను సేకరించినట్లు తెలిసింది.
కేసు నేపథ్యం ఇదే….
SIB Ex DSP Praneeth Rao Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును(Ex DSP Praneeth Rao) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటైంది. ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆధారాల ధ్వంసంలో ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు గుర్తించారు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారని ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఐబీలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై పొలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంతో పోలీస్ శాఖ ప్రణీత్ రావును విధుల నుంచి తప్పించింది. సిరిసిల్ల హెడ్ క్వార్టర్ ను విడిచివెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు…. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. ఆ తర్వాత ప్రణీత్ రావుని కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా కీలక సమచారం సేకరించినట్లు తెలుస్తోంది.