DSP Praneet Rao Arrest: పోలీసుల అదుపులో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు… నిఘా ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలు
DSP Praneet Rao Arrest: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
DSP Praneet Rao Arrest: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారాల ధ్వంసం కేసులో మాజీ డిఎస్పీని పంజాగుట్ట Panjagutta పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారమే ప్రణీత్ రావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు praneet Rao తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రికార్డులు, ఆధారాలను ధ్వంసం చేసినట్టు గుర్తించారు. పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో పాటు డాక్యుమెంట్లను తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. ఎలక్ట్రిషియన్ సాయంతో సీసీటీవీలను ఆపేసి ఆధారాలను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుపై SIB అడిషనల్ ఎస్పీAddl SP రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాఖా పరమైన విచారణతో ప్రణీత్ రావును సస్పెండ్ చేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు సిరిసిల్లలో డిఎస్పీ ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేవారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్‌లో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిఘా సమాచారం ధ్వంసం…
ఏళ్ల తరబడి సేకరించిన కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసినట్టు ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో ఈ వ్యవహారంలో బాధ్యులైన ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ డి.రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఐపీసీ సెక్షన్లతో పాటు, ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం(పీడీపీపీ), సమాచార సాంకేతిక(ఐటీ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రణీత్‌రావుపై కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు 2018 నుంచి ఎస్‌ఐబీలో సీఐగా పనిచేశారు.
2023లో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ విధుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు, 17 కంప్యూటర్లు, ప్రత్యేకమైన డెడికేటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. వీటి ద్వారా అనధికారికంగా గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన వివరాలను రహస్యంగా సేకరించి పర్యవేక్షించారనే ఆరోపణలు ఉన్నాయి.
విధుల్లో భాగంగా అందిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, గుర్తుతెలియని వ్యక్తులతో కుమ్మక్కై నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగత పెన్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కుల్లోకి కాపీ చేసుకుంటూ వచ్చారని అనుమానిస్తున్నారు.
గత ఏడాది డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే 4వ తేదీన ప్రణీత్‌కుమార్ హార్డ్ డిస్కులతో పాటు ఇతర పరికరాలు ధ్వంసం చేశారు. ఎలక్ట్రిషియన్ సాయంతో సీసీ కెమెరాలనూ నిలిపివేసి రికార్డులను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ఉపకరణాల స్థానంలో కొత్త వాటిని బిగించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఎస్‌ఐబీలో కీలక సమాచారంతో పాటు వాటిని భద్రపరిచే ఉపకరణాలు మాయమయ్యాయని గుర్తించిన అడిషనల్ ఎస్పీ రమేశ్ విచారణలో ఈ వ్యవహారం బయటపడింది. ఆధారాల ధ్వంసం వెనుక రాజకీయ కోణం ఉండి ఉంటుందని, కొందరు 'పెద్దల' సహకారంతోనే ఈ చర్యలకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు.
ఎన్నికలకు ముందు నుంచి ప్రణీత్ రావు వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామని పలు సందర్భాల్లో హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనే చర్చ జరుగుతోంది.