Hyderabad City Police : హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం - పంజాగుట్ట పీఎస్ మొత్తం బదిలీ…!-hyderabad cp kothakota srinivas reddy has transferred the entire staff of panjagutta police station ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad City Police : హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం - పంజాగుట్ట పీఎస్ మొత్తం బదిలీ…!

Hyderabad City Police : హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం - పంజాగుట్ట పీఎస్ మొత్తం బదిలీ…!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2024 12:49 PM IST

Hyderabad City Police News: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పీఎస్ లోని 85 మంది సిబ్బందిని బదిలీ చేశారు.

హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం
హైదరాబాద్‌ సీపీ సంచలన నిర్ణయం (hyd city police)

Hyderabad CP Kothakota Srinivas Reddy Orders: హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ లో హోంగార్డు నుంచి మొదలు…పైఅధికారుల వరకు సిబ్బందిని పూర్తిగా బదిలీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఏఎస్ఐలు, పీసీలతో పాటు హోంగార్డులు ఉన్నారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేసేందుకు కొత్తవారిని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి కారు డ్రైవింగ్ కేసులో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు మరిన్ని వివాదాలను పరిగణలోకి తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షకీల్ కుమారుడి కేసులో కీలక సమాచారం బయటికి పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక తాజా ఆదేశాల నేపథ్యంలో…. బదిలీ అయిన వారంతా కూడా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

మరోవైపు పంజాగుట్ట పీఎస్‌కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. వీరంతా రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు.

హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తాజాగా మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌వాహె ఉన్నారు. నిందితుడు సాహిల్‌ను తప్పించడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు.తాజా అరెస్టులతో కలిపి ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్‌ పారిపోయిన ప్రధాన నిందితుడు సాహిల్‌తో పాటు అతని తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కోసం పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ ఇటీవలే నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరాల్సిన ప్రేమ్‌కుమార్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ బిహెండబ్ల్యూ కారు అతివేగంగా నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు నిందితుడ్ని తప్పించేశారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ ప్రమాదానికి కారణమని పంజాగుట్టలో కేసు నమోదు చేయించారు. నిజామాబాద్‌ సిఐ ఫోన్‌లో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు తో మాట్లాడి కేసు తారుమారు చేయడానికి సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది.

స్టేషన్‌ నుంచి సాహిల్‌ను విడిపించిన దృశ్యాలు సిసిటీవీలో నమోదయ్యాయి. నిందితుల సెల్‌ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా షకీల్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి.కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్‌కుమార్‌ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన సాహిల్‌ను ముంబయికి పంపించడంలో షకీల్‌ అనుచరుడైన అబ్దుల్‌వాహె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని వదిలేసిన ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగానే అసలు నిందితుడి స్థానంలో మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హిట్ అండ్ రన్ కేసు మాత్రమే కాకుండా పలు వివాదాల్లో పంజాగుట్ట పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిన్నింటి నేపథ్యంలో… సీపీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 53 మంది ఎస్‌హెచ్‌ఓలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

IPL_Entry_Point