MP Borlakunta Venkatesh Netha : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ గడ్డం వంశీకృష్ణకే దక్కింది. పెద్దపల్లి లో కాంగ్రెస్ నుంచి 30 మంది టికెట్ ఆశించగా చివరకు వంశీకృష్ణ ను అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించింది. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బిఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ బోడకుంట వెంకటేష్ నేత(Borlakunta Venkatesh Netha) ఈసారి టికెట్ రాదని ముందుగానే గ్రహించి 50 రోజుల క్రితం బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. చెయ్యెత్తి జై కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ(Peddapalli Lok Sabha constituency) పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఘనవిజయం సాధించడంతో వెంకటేష్ నేత మరో సారి ఎంపీ అవ్వాలని ఆశతో కాంగ్రెస్ లో చేరగా చివరకు కాంగ్రెస్ మొండిచెయ్యే చూపించింది. టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేయడంతో వెంకటేష్ నేతతోపాటు మాజీ ఎంపీ సుగుణకుమారి, మాజీ ఎంపీ వెంకటస్వామి మనవడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ ముగ్గురు పేర్లను పిసిసి స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసి కి పంపించగా గడ్డం వంశీకృష్ణ ను అభ్యర్థిగా కాంగ్రెస్ పెద్దలు ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అధిష్టానం ఆశిస్సులు లభించకపోవడంతో అయోమయంలో పడ్డారు. పార్టీ మారిన ప్రయోజనం లేకుండాపోయిందనే భావనలో వెంకటేష్ నేత అనుచరులు ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలు మారే వారికి గుణపాఠంగా ప్రజలు భావిస్తున్నారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ హోదాలో ఉన్న వెంకటేష్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరి మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై ఓటమి పాలయ్యారు. అనతికాలంలోనే బిఆర్ఎస్ లో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెంకటేష్ నేత బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. చేరిక సమయంలో కాంగ్రెస్ పెద్దలు ఏమి హామి ఇచ్చారో తెలీయదు కానీ, ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం సిట్టింగ్ ను కాదని కాక మనవడు వివేక్ తనయుడు వంశీకృష్ణ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది.
ఎస్సీ రిజర్వు అయిన పెద్దపల్లి పార్లమెంటు(Peddapalli Lok Sabha constituency) నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చెన్నూరు నుంచి వంశీకృష్ణ తండ్రీ వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి పెద్దనాన్న వినోద్ గెలుపొందారు. ప్రస్తుతం వంశీకృష్ణ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి వెంకటస్వామి (కాక) నాలుగు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాక వారసుడిగా 2009 లో వివేక్ వెంకటస్వామి పోటీ చేసి ఎంపిగా గెలుపోందారు. 2014 లో మరోసారి ఓటమిపాలై బిఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల ముందు బిఆర్ఎస్ నుంచి బిజేపి లో చేరిన వివేక్, మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి మాతృసంస్థ కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాక వారసులుగా వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండడంతో వంశీకృష్ణ ఎంపీగా గెలువడం నల్లేరుపై నడుకేనని భావిస్తున్నారు.
పెద్దపల్లి(Peddapalli Lok Sabha constituency) నుంచి పోటీ చేసే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బిఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బిజేపి నుంచి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారుతో ప్రచారం ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేసే ముగ్గురిలో ఇద్దరు మాల కాగా, ఒకరు నేతకాని సామాజిక వర్గానికి చెందిన వారు. చేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎంపీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయనే ప్రచారం ఉంది.