Jagtial Ganja Case : జల్సాల కోసం గంజాయి సప్లై- జగిత్యాలలో ముఠా అరెస్ట్!-jagtial crime police arrested five members in ganja gang investigation on inter students case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Ganja Case : జల్సాల కోసం గంజాయి సప్లై- జగిత్యాలలో ముఠా అరెస్ట్!

Jagtial Ganja Case : జల్సాల కోసం గంజాయి సప్లై- జగిత్యాలలో ముఠా అరెస్ట్!

HT Telugu Desk HT Telugu
Mar 23, 2024 10:40 PM IST

Jagtial Ganja Case : జగిత్యాలలో ఇంటర్ బాలికలు గంజాయికి అలవాటుపడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరికి గంజాయి సప్లై చేసిన ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయ

జల్సాల కోసం గంజాయి సప్లై, జగిత్యాలలో ముఠా అరెస్ట్!
జల్సాల కోసం గంజాయి సప్లై, జగిత్యాలలో ముఠా అరెస్ట్!

Jagtial Ganja Case : జగిత్యాల జిల్లాలో గంజాయి(Ganja) మత్తుపై పోలీసులు స్పందించారు. మైనర్లు గంజాయికి అలవాటుపడి అనారోగ్యం పాలయ్యారని మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో గంజాయి సప్లై చేసే ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి పది కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్ లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సమక్షంలో అరెస్ట్ అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. రాయికల్, మల్లాపూర్ మండలాలకు పెనుగొండ గణేష్, మాలవత్ సతీష్ కుమార్, రావులకరి నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ లు జల్సాలకు అలవాటు పడి చదువు మానేసి ఏపీలోని సీలేరు నుంచి జగిత్యాలకు(Jagtial) గంజాయి సప్లై చేస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న ప్యాకెట్లలో జిల్లాలో గంజాయి విక్రయిస్తున్నారని చెప్పారు. జగిత్యాలలో బాలికలు గంజాయికి అలవాటుపడిన ఘటనకు ఈ ముఠాకు సంబంధంపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. బాలికలు గంజాయి మత్తుపై ఇంకా విచారణ కొనసాగుతుందని త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.

చదువు మానేసి

గంజాయి ముఠాకు సూత్రదారి గణేష్. అతడు 2015లో హైదరాబాద్(Hyderabad) బీటెక్ చదివేటప్పుడు తన స్నేహితుల ద్వారా గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. అతని స్నేహితులు సీలేరు కు వెళ్లి గంజాయి కొనుక్కొని వచ్చేవారు, అలా వారి దగ్గర సీలేరు(Sileru Ganja)చెందిన ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడైనా గంజాయి కావాలనుకుంటే పనికొస్తుందని అతని ఫోన్ లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాడు. గంజాయికి బానిస అవ్వడంతో హైదరాబాద్ లో సరిగా చదవక బీటెక్ ను మధ్యలో ఆపివేసి ఇంటికి వచ్చేశాడు గణేష్. 2018లో రాయికల్ లో అతని మామ పొలంలో డైరీ ఫారం పెట్టి రెండేళ్లు నడిపాడు. నష్టం రావటంతో డైరీ ఫారం మూసివేసి రాయికల్ లో ఉంటుండగా కరీంనగర్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సతీష్ పరిచయమయ్యాడు. ఇద్దరికీ జల్సాలు చేయడానికి డబ్బులు లేకపోవటంతో సీలేరుకు వెళ్లి గంజాయిని తెచ్చి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అనుకున్నారు. ఇద్దరు సీలేరు వెళ్లి గంజాయి తెచ్చి విక్రయించడం మొదలుపెట్టారు. అలా వారికి పరిసర గ్రామాలకు చెందిన నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ మరికొంత మంది కలిశారు.‌ బర్త్ డే పార్టీలల్లో దావత్ లు చేసుకున్నప్పుడు గంజాయి తాగేవాళ్లు. అలా అందరూ గంజాయి అలవాటు ఉండటం వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. మత్తులో మనుగుతూ పలువురిని ముంచుతున్నారు.

సీలేరు నుంచి జగిత్యాలకు

ఐదుగురు సభ్యులు గల ముఠా ప్రతినెల రెండుమూడు సార్లు సీలేరుకు(Sileru) వెళ్లి గంజాయి తెచ్చి, వాళ్లు వినియోగించడంతోపాటు కొంత విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈనెల 1న తెచ్చిన గంజాయి అయిపోవడంతో మళ్లీ 21న మరో పదికిలోలు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు(Ganja Packets) చేసి అమాయక యువకులకు విక్రయిస్తున్నారు. యువకుల వ్యవహారశైలిపై పోలీసులు నిఘా పెట్టగా ముఠా గుట్టురట్టుయింది. ఈ ముఠాకు గంజాయి సప్లై చేసే సీలేరు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇంటర్ విద్యార్థులకు ఎవరెవరికి గంజాయి విక్రయించారు, ఎంతమంది ఈ గంజాయికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సప్లై చేస్తూ విక్రయిస్తున్న నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం