Ganja In Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి వాసనలు.. తనిఖీలు ముమ్మరం
Ganja In Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి వినియోగంపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల ఒడిశా నుంచి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టుబడటంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
Ganja In Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గంజాయి పట్టుబడుతున్న కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. పాన్ షాపుల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాన్ షాపులలో తనిఖీలు ముమ్మరం చేశారు.
ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గంజాయి విక్రయాలకు అడ్డాలుగా భావిస్తున్న పాన్ షాప్ లపై దాడులకు శ్రీకారం చుట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నియత్రించడంలో భాగంగానే పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.
ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాన్ షాపులలో పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసమే పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఇకపై కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని తెలిపారు. పాన్ షాప్ యజమానులు గాని, మరే ఇతర వ్యక్తులు గాని నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించడం, సరఫరా చేయడం లాంటివి చేస్తే అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయికి బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)