Jagtial District : జగిత్యాలలో 'గంజాయి మత్తు' కలకలం..! తెర వెనక సెక్స్ రాకెట్...?-jagtial city police have taken up an investigation into the ganja racket case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Jagtial City Police Have Taken Up An Investigation Into The Ganja Racket Case

Jagtial District : జగిత్యాలలో 'గంజాయి మత్తు' కలకలం..! తెర వెనక సెక్స్ రాకెట్...?

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 09:30 PM IST

Jagtial District Crime News : జగిత్యాల జిల్లా కేంద్రంలో గంజాయి మత్తు వ్యవహారం కలకలం రేపుతోంది. మైనర్లను టార్గెట్ చేస్తుండగా.. ఇదంతా కూడా ఓ సెక్స్ రాకెట్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారానికి సూత్రధారులేవరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

*జగిత్యాలలో గంజాయి మత్తు కలకలం..!
*జగిత్యాలలో గంజాయి మత్తు కలకలం..!

Jagtial District News: జగిత్యాల జిల్లా కేంద్రంలో గంజాయి మత్తు ఆందోళనకు గురి చేస్తోంది. మత్తుకు మైనర్ లు యువత, పదోతరగతి విద్యార్థినిలు బానిస కావడం కలకలం రేపుతోంది. మత్తుకు బానిసైన ఓ బిడ్డ తండ్రీ పోలీసులకు పిర్యాదుతో చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. మైనర్ ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని స్వదార్ హోంకు తరలించారు. గంజాయి మత్తు వెనుక సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లవ్లీ ప్రెండ్స్ గ్రూప్ పేరుతో హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు(Rave Party) వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. సూత్రధారులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సైతం రంగంలోకి దిగి కూపీ లాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

బడి పిల్లలు... బాలికలే బానిసలు..!

జగిత్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గంజాయికి బానిసయ్యింది. గంజాయి కొనేందుకు కావాల్సిన డబ్బుల కోసం తన క్లాస్మెంట్ గంజాయికి అడిక్ట్ అయిన బాలుడిపై ఆధారపడేది. 15 ఏళ్ళు కూడా నిండని ఆ ఇద్దరు గంజాయి మత్తులో మునిగిపోయి దండలు మార్చుకుని పెళ్ళికూడా చేసుకున్నారు. అయితే ఆ బాలుడు గంజాయి (Ganjai)ఇవ్వడం లేదని అతణ్ని వదిలేసిన బాలిక, పోచమ్మవాడకు చెందిన మరో యువకుడికి దగ్గరైంది. అతడు చెప్పినట్టు చేస్తే ఇచ్చే డబ్బుతో గంజాయి కొనుగోలు చేసేది. మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించడంతో పేరెంట్స్ ఓ యువకుడి వల్లే తమ బిడ్డ పరిస్థితి దయనీయంగా మారిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని విచారించి ఎలాంటి కేసు పెట్టకుండా వదిలేశారు. పోలీసుల నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో బాధితురాలి తండ్రీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి బాధితురాలిని కరీంనగర్ లోని స్వధార్ హోమ్ కు తరలించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించగా విస్తుపోయో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె లాగనే దాదాపు 10 మంది బాలికలు గంజాయి మత్తుకు బానిసైనట్లు గుర్తించారు. వారిని సేవ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

లవ్లీ ఫ్రెండ్స్ గ్రూప్…..!

మైనర్ బాలికలే లక్ష్యంగా ఓ ముఠా మత్తు పదార్థాలు ఎరవేసి రేవ్ రోంపిలోకి దింపినట్లు తెలుస్తుంది. అందుకోసం లవ్లీ ప్రెండ్స్ గ్రూప్ తో వాట్సాప్ ద్వారా సెక్స్ రాకెట్ సైతం నడినట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ముఠా.. కోడ్ భాషలో గంజాయిని సప్లై చేసేదని తెలుస్తోంది. గ్రూపులో పది మంది వరకు అమ్మాయిలు ఉండడం గమనార్హం. వారు మత్తుకు బానిస కావడంతో హైదరాబాద్ లో జరిగే రేవ్ పార్టీలకు ఆహ్వానించి, పార్టీ వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు రూ.30 వేలు ఇస్తామని ఆశ చూపేవారని తెలుస్తోంది. బాలికలు అందుకు ఒప్పుకోవడంతో కార్లు పంపించి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి గంజాయికి బదులు డ్రగ్స్ అలవాటు చేసి వారితో అర్ధనగ్న నృత్యాలతో పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది. బాలికలు ఓరోజు రాత్రి పూట వెళ్లిపోయి రెండురోజుల తర్వాత తిరిగిరావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు రాత్రిపూట కాపలా కాశారు. దీంతో దొరికిపోతామని కార్లను పంపించడం బంద్ పెట్టిన ముఠా.. ఉదయం బస్సులో హైదరాబాద్ కు రావాలని, రాత్రి పార్టీ తర్వాత తిరిగి బస్సులోనే వెళ్లిపోవాలని బాలికలకు చెప్పినట్టు తెలిసింది. స్కూల్ కు వెళ్తున్న పిల్లలు ఒకట్రెండు రోజుల దాకా ఇండ్లకు రాకపోవడం, వారి ప్రవర్తలో మార్పు వస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... బయటకు తెలిస్తే పరువు పోతుందని మరికొందరు లోలోపలే కుమిలిపోతున్నారు.

రంగంలోకి అధికారులు….

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మత్తుతో మైనర్ల బతుకులు ఆగమౌతున్న విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.‌ ఇప్పటికే మత్తుకు బానిసై అపస్మారక స్థితిలో స్వధార్ హోంకు చేరిన మైనర్ బాలిక నుంచి వివరాలు సెకరించే పనిలో నిమగ్నమయ్యారు.‌ ఆ బాలిక సరిగా వివరాలు చెప్పే స్థితిలో లెకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పేరెంట్స్ తో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులను సైతం ఆశ్రయించి మత్తు రొంపి నుంచి బాలికలను మైనర్ లను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి తెలిపారు.‌

మరోవైపు గంజాయి మత్తే కాకుండా డ్రగ్స్ సైతం జగిత్యాలలో విచ్చలవిడిగా విక్రయాలు జరిగినట్లు ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ లో తేలింది. జగిత్యాలలో మానస ఈఎన్టీ హాస్పిటల్ నిర్వహించే డాక్టర్ మదన్ మోహన్ ను మత్తు ఇచ్చే డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించినట్లు గుర్తించి వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆ డ్రగ్స్ కు మైనర్ బాలికల మత్తుకు సంబంధం ఉంటుందని భావిస్తున్నారు. దానిపై పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లోతైన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, మైనర్ ల బతుకులను ఆగం చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel