Visakha Crime : రేవ్ పార్టీలో యువతి కోసం గొడవ, స్విమ్మింగ్ పూల్ లో ముంచి యువకుడి హత్య-visakhapatnam crime youth murdered clash between friends for girl in rev party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Crime : రేవ్ పార్టీలో యువతి కోసం గొడవ, స్విమ్మింగ్ పూల్ లో ముంచి యువకుడి హత్య

Visakha Crime : రేవ్ పార్టీలో యువతి కోసం గొడవ, స్విమ్మింగ్ పూల్ లో ముంచి యువకుడి హత్య

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2023 02:14 PM IST

Visakha Crime : విశాఖ జిల్లా అచ్చుతాపురంలో రేవ్ పార్టీకి వచ్చిన ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడ్ని తోటి స్నేహితులే హత్య చేశారు.

విశాఖలో యువకుడు హత్య
విశాఖలో యువకుడు హత్య (Pixabay)

Visakha Crime : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. యువతి కోసం జరిగిన గొడవలో ఓ యువకుడ్ని హత్య చేశారు. విజయనగరం నుంచి కొంత యువతీయువకులు రేవ్ పార్టీ చేసుకునేందుకు అచ్చుతపురం వచ్చారు. వీరంతా మద్యం తాగారు. మద్యం మత్తులో ఓ యువతి కోసం గొడవ పడ్డారు. ఈ గొడవలో ఓ యువకుడిని తోటి స్నేహితులే స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేశారు. మృతుడిని సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వదినపై మరిది అఘాయిత్యం

ఆధునిక పోకడలతో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మానవ సంబంధాలను మరిచి మృగంలా మారిపోతున్నాడు. క్షణ కాలం శారీరక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నాడు. తన జీవితాన్ని జైలు పాలు చేసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. వావివరసలు మర్చిపోయిన ఓ మృగాడు నెల్లూరు జిల్లాలో దారుణానికి పాల్పడ్డాడు. అన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో ఓ నీచుడు సొంత వదినపైనే కన్నేశాడు. తల్లి లాంటి వదినపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరిది తనపై అత్యాచారం చేసిన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మద్యం మత్తులో కత్తులతో దాడి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని రాంనగర్ ఎస్సీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. మద్యం మత్తులో నలుగురు యువకులు ఒక దళిత మహిళతో పాటు ఆమె మరిదిపై కత్తులు, కొడవళ్లతో దాడికి దిగారు. దీంతో దళిత మహిళతో పాటు ఆమె మరిది గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటకు చెందిన అయూష్, శెల్వీ, అంకూష్, ఆబాద్ నలుగురు ఫ్రెండ్స్. కాగా శుక్రవారం రాత్రి నలుగురూ మద్యం తాగి కిరాణం నడుపుతున్న పరికి అనిత ఇంటి వద్దకు వచ్చి పాన్ మసాలాలు అడిగారు. అవి లేవని చెప్పడంతో నలుగురు ఆమెతో వాదనకు దిగారు. అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారు. దీంతో ఇంట్లో ఉన్న అనిత మరిది నవీన్ బయటకు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వినకుండా అనిత, నవీన్ తో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే నలుగురు కలిసి కత్తులు, కొడవళ్లతో ఇద్దరిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో అనిత, నవీన్ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి వచ్చి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. కాగా గతంలో ఆ నలుగురు యువకులపై కేసులు నమోదు అయ్యాయని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని నవీన్ పోలీసులను కోరాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.