WhatsApp honey trap scam: వాట్సాప్ లో కొత్త స్కామ్; వీడియో కాల్స్ తో రెచ్చగొడ్తారు జాగ్రత్త..
WhatsApp: వాట్సాప్ వినియోగదారులు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండండి. వాట్సాప్ వేదికగా మరో కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి. వారి నుంచి వచ్చే శృంగార, అశ్లీల కామెంట్స్ కు స్పందించకండి. ఈ హనీ ట్రాప్ స్కామ్ బారిన ఇప్పటికే చాలామంది బాధితులు పడ్డారు.
ప్రతీకాత్మక చిత్రం (AFP)
WhatsApp honey trap scam: మీకు వాట్సప్ లో అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద సందేశం వచ్చిందా లేదా మీకు పరిచయం లేని వ్యక్తి వాట్సాప్ లో మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తారా?.. జాగ్రత్త.. వెంటనే స్పందించకండి. (scam alert) వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లో చాలా మంది వినియోగదారులను ప్రభావితం చేస్తున్న కొత్త రకం ఆన్ లైన్ స్కామ్ ‘వాట్సాప్ హనీ ట్రాప్ స్కామ్ (WhatsApp honey trap scam)’ లో ఇది ఒక భాగం. వాట్సాప్ వినియోగదారులతో రొమాంటిక్ కనెక్షన్ ఏర్పరుచుకోవడం ద్వారా వారిని దోచుకోవడానికి ఈ స్కామర్స్ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ హనీ ట్రాప్ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
- మోసగాళ్లు ముందుగా వాట్సాప్ (WhatsApp) లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. బాధితులను ఆకర్షించే లక్ష్యంతో అందమైన, రొమాంటిక్ లేదా అశ్లీల ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటారు.
- ర్యాండమ్ గా వాట్సాప్ నంబర్స్ కు ఈ స్కామర్లు మెసేజ్ లను పంపిస్తారు. చిన్నగా సంభాషణలను ప్రారంభిస్తారు. నమ్మకాన్ని పొందడం కోసం చాలా స్నేహపూర్వకంగా లేదా సరసమైన రీతిలో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు.
- ఒకసారి వీరిని నమ్మడం ప్రారంభించిన తరువాత, నెమ్మదిగా ఈ మోసగాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ప్రారంభిస్తారు.
- ఈ వీడియో కాల్స్ సమయంలో, వివిధ రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. నగ్నంగా వీడియో కాల్స్ చేద్దామని ఒత్తిడి చేస్తారు. ఆ తరువాత ఆ వీడియోల రికార్డింగ్ లతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు.
- వారికి డబ్బు ఇవ్వకపోతే లేదా వారి ఇతర డిమాండ్లను తీర్చకపోతే స్కామర్లు ఈ రికార్డింగులను మీ స్నేహితులు, కుటుంబం లేదా సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు.
- ఈ బ్లాక్ మెయిల్స్ ను భరించలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి.
వాట్సాప్ హనీ ట్రాప్ స్కామ్ నుండి సురక్షితంగా ఉండటం ఎలా?
- మీరు ఆన్ లైన్ లో ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను, మెసేజెస్ ను పట్టించుకోకండి.
- వాట్సప్ (WhatsApp) లో వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
- తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ కు అస్సలు స్పందించవద్దు. వీలైతే, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి.
- ఒకవేళ మీకు ఇలాంటి మెసేజెస్ లేదా కాల్స్ వస్తే, వెంటనే వాట్సాప్ కు రిపోర్ట్ చేయండి.
- ఒకవేళ ఇప్పటికే వారి చేతిలో మోసపోతే, పూర్తి వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.