Bhadradri District : భద్రాద్రి జిల్లాలో 11 టన్నుల గంజాయి దహనం - విలువ రూ.28 కోట్లు-11 tonnes of cannabis burnt in bhadradri district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri District : భద్రాద్రి జిల్లాలో 11 టన్నుల గంజాయి దహనం - విలువ రూ.28 కోట్లు

Bhadradri District : భద్రాద్రి జిల్లాలో 11 టన్నుల గంజాయి దహనం - విలువ రూ.28 కోట్లు

HT Telugu Desk HT Telugu

Bhadradri Kothagudem News: భదాద్రి జిల్లాలో 11.5 టన్నుల నిషేధిత గంజాయిని దహనం చేశారు పోలీసులు. దీని విలువు సుమారు రూ. 28 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

గంజాయి దహనం

Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత గంజాయి కలకలం రేపుతోంది. పక్కనే ఉన్న రాష్ట్రాల నుంచి భారీగా తరలి వెళ్తున్న గంజాయి ఈ జిల్లాలో పోలీసులకు తరచూ పట్టుబడుతోంది. రెండు నెలల కిందటే టన్నులకొద్దీ గంజాయిని దహనం చేసిన పోలీసులు మళ్లీ అదే స్థాయిలో పట్టుబడిన గంజాయిని అధికారికంగా దహనం చేశారు.

భద్రాచలం, ఖమ్మం జిల్లాల మీదుగా పెద్ద ఎత్తున గంజాయి (Cannabis)హైదరాబాద్ వైపు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుంచి 11,545 కేజిలు(11.5 తన్నులు) నిషేధిత గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. కాగా పెద్ద మొత్తంలో పోగైన ఈ గంజాయిని హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో గురువారం పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ ఆశ్చర్యం కలిగించే రీతిలో రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన రోహిత్ రాజు ఐపిఎస్ తో పాటు సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, డీసిఆర్బీ సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్ఐ ఎంటిఓ, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, ఆరెఎస్సై జగన్ ఆధ్వర్యంలో కోర్టు అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం ఈ నిషేధిత గంజాయిని గురువారం సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేశారు. 

ముందుగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని(cannabis) హెడ్ క్వార్టర్స్ లో తూకం వేసి పరిశీలించారు. అనంతరం దహనం కోసం సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ NDPS యాక్ట్ లోని నియమ, నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని, ఈ విధంగా అసాంఘీక కార్యాలపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్, డిఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్ఐలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.