Bhadradri Kothagudem : భద్రాద్రిలో 4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
Bhadradri Kothagudem district News: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లాలో మరోసారి గంజాయి పట్టుబడింది. ఈసారి ఏకంగా నాలుగు క్వింటాలు దొరికింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bhadradri Kothagudem District Crime News: భద్రాద్రి జిల్లా మీదుగా నిత్యం క్వింటాళ్ల కొద్దీ గంజాయి తరలిపోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఏజెన్సీ కావడం, పొరుగునే ఇతర రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఈ ప్రాంతం మీదుగా రోజూ పలు వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో సైతం గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు సాహసిస్తున్నారు. ఇటీవలే 11 టన్నుల నిషేధిత గంజాయిని పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ ఏదో ఒక మార్గంలో గంజాయి తరలి వెళుతూనే ఉంది.
నాలుగు క్వింటాళ్లు పట్టివేత….
Ganja Seized at Bhadrachalam: తాజాగా భద్రాచలం పట్టణంలో జరిపిన తనిఖీల్లో 4 క్వింటాళ్ల గంజాయి దొరకడం మళ్లీ కలకలం రేపుతోంది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని భద్రాచలం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పీవీఎన్.రావు తన సిబ్బందితో భద్రాచలం పట్టణంలోని ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. కాగా ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆపి తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి కంగారు పడుతూ భయంతో బస్ దిగి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారన్నారు. పట్టుబడిన నిందితుడితో పాటు బస్సులోనే ఏడుగురు అతని సమీప బంధువులు కలిసి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయిని ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుంచి కోలా ఆనంద్ అలియాస్ బుజ్జి, బాల్ రెడ్డిల నుంచి సుమారు 4 క్వింటాళ్ల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో డోర్ మ్యాట్ల మధ్య భాగాన్ని కత్తిరించి వాటిని ఒక దానిపై మరొకటి పేర్చారని తెలిపారు. వాటి మధ్య భాగాలలో గంజాయి ప్యాకెట్లను ఎవరూ కనిపెట్టకుండా దాచిపెట్టి సాధారణ ప్రయాణికుల్లాగా బస్సు సిబ్బందిని, తోటి ప్రాయణికులను నమ్మించి ప్లాస్టిక్, డోర్ మ్యాట్లు అమ్మే వారిలా నటిస్తూ అక్రమంగా గంజాయిని హైదరాబాద్ కు తరలించి అక్కడ అవసరం ఉన్న వ్యక్తులకు అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో వీళ్ళు వెళుతున్నారని తెలిపారు. భద్రాచలం పట్టణ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హర్యానా రాష్ట్రంకు చెందిన బల్జీత్, రవిదాస్, సూరజ్ బాన్, గీన్న, తక్ దిర్, రామ్మోహర్, సుందర్, రాజ్పాతిలపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే పిల్లలు మత్తు పదార్ధాలకు అలవాటై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో కూడా యువత మత్తు పదార్ధాలను వినియోగించే ప్రదేశాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్ధాలను తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.