Bhadradri Kothagudem : కొత్తగూడెంలో గంజాయి కలకలం.. రూ.25 లక్షల విలువైన సరుకు పట్టివేత
Bhadradri Kothagudem district News: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో క్వింటా గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ. 25 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bhadradri Kothagudem District Crime News: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి దొరుకుతున్న ఘటనలు అనునిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోజుల వ్యవధిలోనే కేజీల కొద్దీ గంజాయి పట్టుబడుతుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇద్దరు మహిళలు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళుతూ గంజాయి చాక్లెట్లతో పట్టుబడిన ఉదంతం మొదలుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గంజాయి పట్టుబడుతూనే ఉంది.
తాజాగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో క్వింటా గంజాయి పట్టుబడడం(ganja seized in Kothagudem) కలకలం రేపుతోంది. దీని విలువ అక్షరాల పాతిక లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు TS09EH0459 అనే నెంబర్ కలిగిన కారులో తరలిస్తున్న ఒక క్వింటాల్ గంజాయి (49)ప్యాకెట్లను పట్టుకున్నారు.
కొత్తగూడెం వన్ టౌన్ సిఐ ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో ఎస్సై విజయ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సూపర్ బజార్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా వెళ్తున్న కారుని ఎస్సై విజయ ఆపి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులోని ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో కళ్ళు తిరిగే రీతిలో ఒక క్వింటాల్ బరువు గల 49 నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించడం పోలీసులనే అబ్బురపరిచింది.