Khammam BRS : ఖమ్మం కారు పార్టీలో రచ్చ, రచ్చ…! పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తుమ్మల, పొంగులేటి పేర్లు
Khammam Lok Sabha Constituency : ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. పొంగులేటి, తుమ్మల పార్టీ వీడటంతో పాటు పలు అంశాలను పలువురు ప్రస్తావించారు.
Khammam BRS News : ఖమ్మం కారు పార్టీ సమావేశంలో రచ్చ రచ్చ చోటుచేసుకుంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ(Khammam Lok Sabha Constituency) అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. తొలుత మధిర నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి హల్చల్ చేశారు. వేదిక మీదకి తనను ఆహ్వానించకపోవడం పట్ల ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులను మాత్రమే ఆహ్వానించి తనకు వేదికపై చోటు కల్పించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులను ఎదుర్కొని, లాఠీ దెబ్బలను తిన్నది మేమైతే అధికారాన్ని అనుభవించిన పెద్దలే పార్టీ సమావేశంలో కూడా వేదిక మీద కూర్చుంటారా..? అని ప్రశ్నించారు. పార్టీలో దొంగలు తయారయ్యారని, ఉద్యమకారులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కలుగజేసుకొని వేదిక కింద ఉన్న రామ్మూర్తిని బుజ్జగించి పైకి తీసుకొచ్చారు. దీంతో ఆయన శాంతించారు.

తుమ్మల, పొంగులేటి ప్రస్తావన..
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ల ప్రస్తావన విస్మయం కలిగించింది. తుమ్మల, పొంగులేటి నామస్మరణతో సమావేశం మారుమ్రోగింది. గెలుపు గుర్రాలైన వారిద్దరినీ వదులుకుని పార్టీ పెద్ద తప్పు చేసిందని నాయకులను కార్యకర్తలు నిలదీశారు. వాళ్లిద్దరూ పార్టీ వీడిపోవడానికి జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరో ఎమ్మెల్యే కారణమని విరుచుకుపడ్డారు. వారు అధిష్టానం దగ్గర తప్పుడు మాటలు చెప్పడంతోనే పార్టీలో కీలక నేతలు పార్టీ వీడిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నాయకుల వ్యక్తిగత స్వార్ధాల కోసం వాళ్ళను బయటకు పంపించారని కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని ఆగ్రహం చెందారు. మీ చెప్పుడు మాటలు విని కేసీఆర్, కేటిఆర్ లు.. తుమ్మల, పొంగులేటి బలాన్ని తక్కువ అంచనా వేశారని ఆక్షేపణ వ్యక్తం చేశారు. చెప్పేవాడు చెబితే వినే అధిష్టానానికైనా బుద్ధి లేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నామాను బలిపశువు..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(Loksabha Elections 2024) నామా నాగేశ్వరరావుని బలి చేసే కుట్ర జరుగతోందని కార్యకర్తలు మండిపడ్డారు. ఆయనకు ఇష్టం లేకపోయినా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని అంటగట్టి బలి చేయాలన్న ఎత్తు వేశారని గుర్రుమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్, మాజీ మంత్రి కేటిఆర్ ఇకనైనా కండ్లు తెరవాలని హితవు పలికారు. కాగా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజా పరిస్థితితో నిర్ఘాంతపోయారు. కార్యకర్తలు ఆగ్రహంగా అడిగిన ప్రశ్నలపై ఏమాత్రం స్పందించకుండా ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై విమర్శలు చేయడం కార్యకర్తలకు విస్మయం కలిగించింది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఆరకమైన దిశా నిర్దేశం లేకుండానే సాగిపోయింది. ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే లాస్య నందితకు సమావేశంలో నివాళులు అర్పించారు.