తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raids On Mro: కోట్లలో ఆస్తులు పోగేసిన జమ్మికుంట ఎమ్మార్వో… ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు

ACB Raids On MRO: కోట్లలో ఆస్తులు పోగేసిన జమ్మికుంట ఎమ్మార్వో… ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు

HT Telugu Desk HT Telugu

14 March 2024, 7:47 IST

google News
    • ACB Raids On MRO: వరంగల్ నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలం ఎమ్మార్వోగా పనిచేసిన అవినీతి అధికారి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తుల్ని గుర్తించారు. 
జమ్మికుంట ఎమ్మార్వోపై ఏసీబీ దాడులు
జమ్మికుంట ఎమ్మార్వోపై ఏసీబీ దాడులు

జమ్మికుంట ఎమ్మార్వోపై ఏసీబీ దాడులు

ACB Raids On MRO: వరంగల్ నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేసిన ఓ లేడీ ఎమ్మార్వో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తగా.. కేసు నమోదు చేసిన ఏసీబీ  ACB అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. దీంతో రెవెన్యూ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం కరీంనగర్ karimnagar జిల్లా జమ్మికుంట Jammikunta మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఎం.రజనీ రెడ్డి ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కాలం పని చేసింది. అందులోనూ హనుమకొండ జిల్లా పరిధిలోనే చాలాకాలం ఎమ్మార్వో MROగా పని చేశారు.

తహసీల్దార్ రజనీరెడ్డి రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు, ఇతర పనుల కోసం ఎవరైనా ఎమ్మార్వో ఆఫీస్ కు వస్తే.. ఎంతో కొంత ముట్టజెప్పేదాక ఫైల్ ముట్టుకోదనే ఆరోపణలున్నాయి. దీంతోనే అక్రమ ఆస్తులు పెద్ద మొత్తంలో పోగు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

తెల్లవారుజాము నుంచే సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉందని కొందరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే యాక్షన్ స్టార్ట్ చేశారు.

హనుమకొండ సుబేదారిలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న తహసీల్దార్ ఎం.రజనీరెడ్డి నివాసంతో పాటు గతంలో ఆమె పని చేసిన ధర్మసాగర్ ఎమ్మార్వో ఆఫీస్ లోనూ తనిఖీలు నిర్వహించారు.

ఉమ్మడి వరంగల్ Warangal , కరీంనగర్ లోని ఆమె బంధువులు, బినామీల ఇండ్లు మొత్తం ఐదు చోట్లా ఏకకాలంలో సోదాలు చేపట్టి.. ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలను ఆరా తీసే పనిలో పడ్డారు. ఎమ్మార్వోగా కొనసాగిన సమయంలో ఆమె చేసిన రిజిస్ట్రేషన్లపై వివరాలు సేకరించారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరగగా.. రూ.కోట్లలో అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధకశాఖ అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా ధర్మసాగర్ Dharmasagar మండల కేంద్రంలో తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తిన ఓ పెద్ద రియల్టర్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టి, వివిధ డాక్యుమెంట్లపై ఆరా తీశారు. దీంతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల్లోనూ అయోమయం కనిపించింది.

రూ.కోట్ల విలువైన ఆస్తులు

అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా.. రూ.కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. తహసీల్దార్ రజనీరెడ్డి బినామీలు, బంధువుల ఇళ్లలో లభించిన డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాల ప్రకారం మొత్తంగా రూ.3,20,16, 915 (మూడు కోట్ల 20 లక్షల 16 వేల 915) విలువైన అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో ప్రధానంగా రూ.55,22,630 విలువ చేసే ఏడు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన ఏడు డాక్యుమెంట్లు, రూ.21,17,700 విలువ చేసే 22 ఓపెన్ ప్లాట్లు, మరో మూడు ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ముందస్తు అగ్రీమెంట్ చేసుకున్న రూ.50 లక్షల విలువైన డాక్యుమెంట్లు, నెట్ క్యాష్ రూ.1,51,540 సీజ్ చేశారు. అంతేగాకుండా 1.4 కిలోల బంగారు ఆభరణాలు, రూ.31.06 లక్షల విలువైన వాహనాలు కలిగి ఉన్నట్లు తేల్చారు.

రెవెన్యూ వర్గాల్లో కలవరం

తహసీల్దార్ రజనీ అక్రమాస్తుల వ్యవహారం ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలవరం సృష్టించగా.. ఆమె ప్రతి పనిని పైసతోనే ముడిపెట్టేదనే ఆరోపణలున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించి, రూ.కోట్ల విలువైన భూములను తన బంధువులు, బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ధర్మసాగర్ మండలం కేంద్రంలోనే అసైన్డ్, ప్రభుత్వ భూములు, వివాదాస్పద ల్యాండ్స్ విషయంలో జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున సెటిల్ మెంట్లు చేసినట్లు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం తహసీల్దార్ రజనీరెడ్డి ఆస్తుల విలువ రూ.3.20 కోట్లు కాగా.. వాస్తవ ఆస్తుల లెక్కలు అంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండనుంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం