Nizamabad Crime : ఆర్మూర్ లో డిప్యూటీ తహసీల్దార్ అమానుషం- యాచకుడిని కాలుతో తన్నిన వైనం, లారీ కింద పడి మృతి
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణం జరిగింది. యాచకుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన డిప్యూటీ తహసీల్దార్... అతడి మరణానికి కారణం అయ్యాడు. యాచకుడ్ని కాలితో తన్నడంతో అటుగా వస్తున్న టిప్పర్ లారీ కింద పడి అతడు మృతి చెందాడు.
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tehsildar)కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొని నిజాంసాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం దుర్మరణం చెందాడు. కాగా పోలీసులు కేసు నమోదు(Police Case) చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు శివరాం స్థానిక కూడలి వద్ద కార్లను తూడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా.. శివరాం కారు గ్లాస్ ను క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరగా రాజశేఖర్ లేవని చెప్పాడు. అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు వెంబడి శివరాం పరుగుపెట్టాడు.
కాలితో తన్నడంతో టిప్పర్ కింద పడిన యాచకుడు
అయితే కారు నుంచి దిగిన రాజశేఖర్ కోపంతో ఊగిపోయాడు. శివరాంను కాలితో తన్నడంతో అటుగా వస్తున్న టిప్పర్ వెనుక టైర్ల కిందపడి బాధితుడు దుర్మరణం చెందాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించారు. రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మరోవైపు మృతుడి కుటుంబీకులు శుక్రవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓ మండలానికి డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న అధికారి ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇతడు భీంగల్ డివిజన్ టీఎన్జీవోలో కీలక బాధ్యతల్లో ఉన్నట్టు సమాచారం.