ACB Trap in Nalgonda : రూ. 3 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆస్పత్రి సూపరింటెండెంట్
ACB Trap in Nalgonda : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబికి చిక్కారు. రూ. 3 లక్షలు తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు.
ACB Trap in Nalgonda: ఇటీవలే కాలంలో లంచం డిమాండ్ చేస్తున్న కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అరెస్ట్ అవుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. పక్కాగా సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు…సదరు అధికారిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. రూ. 3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
ఏం జరిగిందంటే…?
డాక్టర్ లచ్చు నాయక్… ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఔషధాల సరఫరా టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి రూ. 3 లక్షలను డిమాండ్ చేశాడు. డబ్బును ఇవ్వలేని వెంకన్న… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారమే… వెంకన్న రూ. 3 లక్షలను లచ్చు నాయక్ కు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లచ్చు నాయక్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకోవటంతో పాటు సదరు అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నారు.