Revanth On TSPSC Paper Leak : వాళ్లకు ర్యాంకులు ఎలా వచ్చాయి?
19 March 2023, 15:54 IST
- TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వం మీద మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్((TSPSC Paper Leak) దారుణమని మండిపడ్డారు. పేపర్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరికే సంబంధం ఉందని కేటీఆర్(KTR) అతి తెలివి తేటలు ప్రదర్శించారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టు అయిన తొమ్మిది మంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2015 నుంచి పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ(TSPSC) నిందితులు ఉన్న చంచలగూడ జైలుకు మధ్యవర్తిత్వం చేసేందుకు ఎవరు వెళ్లారని రేవంత్ రెడ్డి అడిగారు. పేర్లు బయటపెడితే.. చంపేస్తామన్నారని.., అన్ని బయటకు రావాలన్నారు. చంచల్ గూడ సందర్శకుల జాబితాను చూపించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేయాలన్నారు.
'పేపర్ లీక్ వెనకలా ఎవరు ఉన్నారో తేటతెల్లం చేయాలి. నిందితులను పోలీసుల కస్టడీకి తీసుకోక ముందే.. రాజశేఖర్, ప్రవీణ్ మాత్రమే నిందితులని కేటీఆర్ ఎలా నిర్ధారించారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు కమిషన్ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ చొరవతో ఇరవై మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలని, లేదంటే.. లాంగ్ లీవ్(Long Leave)లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలని చెప్పారు. టీఎస్పీఎస్సీలో పని చేసే.. మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం, రజనీకాంత్ రెడ్డికి నాల్గొ ర్యాంక్ రావడం వెనక కారణాలు ఏంటో తెలియాలన్నారు. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారిలో 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనక ఏం జరిగింతో తేలాలని రేవంత్ రెడ్డి అన్నారు.
'నిందితుల పూర్తి వివరాలు వెల్లడించాలి. సిట్ దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదు. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలి. ఈ మేరకు కోర్టును కోరతాం. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని పిలుపునిస్తున్నాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.