TPCC: కోమటిరెడ్డి మళ్లీ లైన్ లోకి వచ్చినట్టేనా..? ఇకపై సమైక్యరాగమేనా..?
21 January 2023, 7:01 IST
- komatireddy venkat reddy: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు నుంచే ఎంపీ కోమటిరెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తూ వచ్చారు. ఇదీ కాస్త మునుగోడు బైపోల్ టైంలో తీవ్రస్థాయికి చేరింది. కనీసం ప్రచారానికి కూడా రాలేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అయితే తాజాగా గాంధీభవన్ కు వచ్చారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామం టీ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది.
ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి
MP komatireddy venkat reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు... ఆయన కామెంట్స్ పై అధిష్టానం కూడా సీరియస్ అయింది. షోకాజ్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్లింది. వీటికి వెంకట్ రెడ్డి రిప్లే ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా జరిగిన తర్వాత వెంకట్ రెడ్డి చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ... రేవంత్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు, కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య సీనియర్ల భేటీకి కూడా మద్దతు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా జరుగుతున్నప్పటికీ... ఆయన మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతారనే చర్చ కూడా జోరుగా నడించింది. వీటికి చెక్ పెడుతూ శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఠాక్రేతోనే కాదు పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ కావటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన చర్చనీయాంశంగా మారారు.
లైన్ లోకి వచ్చినట్టేనా..?
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదని.. కాబట్టి ప్రజల్లోకి వెళితేనే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌కు చెప్పారు. ఇదే విషయం బయట మీడియా మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దాదాపు 50 శాతం సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలంటూ కోమటిరెడ్డి కామెంట్స్ కూడా చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల కూడా అభ్యర్థులతో మాట్లాడి త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలను పోరాటానికి సిద్ధం చేయాలని, వచ్చే ఆరు నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలని వాటన్నింటిపై ఇన్‌ఛార్జితో చర్చించానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
చాలాకాలం తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్‌కు రావడం.. రేవంత్ తో మాట్లాడటంతో పార్టీలో కీలక పరిణామంగా మారిందనే చెప్పొచ్చు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేయటంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అయినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన కాస్త మనసు విప్పి మాట్లాడినట్టు కనిపించారు. పరోక్షంగా తాను పార్టీతోనే ఉంటాననే సంకేతాలు గట్టిగా ఇచ్చినట్టు కనిపించింది. అయితే ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో కూడా కోమటిరెడ్డి యాక్టివ్ గా పాల్గొంటారనే అర్థమవుతోంది.
గతంలో కూడా కోమటిరెడ్డి...పలుమార్లు రేవంత్ తో భేటీ కావటం అనంతరం విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఎలా ఉంటారో ఊహించలేమని.. పార్టీ విషయంలో ఆయన తీరు ఇదే విధంగా ఉంటుందా..? లేదా..? అనేది కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఇకపై సమైక్యరాగం వినిపిస్తారా..? లేక మళ్లీ అసంతృప్తివాదాన్ని తెరపైకి తీసుకువస్తారా..? పార్టీ విజయం కోసం నేతలందరితో కలిసి నడుస్తారా..? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.