Telangana Congress : టీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు.. రేవంత్, కోమటిరెడ్డి భేటీ.. -interesting developments in telangana congress komati reddy venkat reddy meets revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : టీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు.. రేవంత్, కోమటిరెడ్డి భేటీ..

Telangana Congress : టీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు.. రేవంత్, కోమటిరెడ్డి భేటీ..

Thiru Chilukuri HT Telugu
Jan 20, 2023 07:49 PM IST

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలా కాలంగా అంటీముట్టనట్లుగా ఉంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా భేటీ అయ్యారు. ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

గాంధీభవన్ లో అరుదైన దృశ్యం
గాంధీభవన్ లో అరుదైన దృశ్యం

Telangana Congress : అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఆ పార్టీ తీరు ఒకే రకంగా ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే హస్తంలో.. అంతర్గత కలహాలూ ఎక్కువే. ఎప్పుడు ఎవరిపై సీరియస్ అవుతారో... ఎవరు ఏ సమయంలో పార్టీపై బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తారో చెప్పలేని పరిస్థితి. ఇవాళ కలిసున్న నేతలే.. రేపు బద్ధ విరోధుల్లా వ్యవహరించే తీరు... కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో ప్రస్ఫుటం అయింది. ఇలాంటి ఎన్నో సందర్భాలకు వేదిక అయిన తెలంగాణ కాంగ్రెస్ లో... శుక్రవారం అరుదైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడూ గాంధీ భవన్ మెట్లెక్కనూ అన్న ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అంటీ ముట్టనట్లు ఉండే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇద్దరూ ఉత్సాహంగా కాసేపు ముచ్చటించారు. దీంతో... చాలారోజుల తర్వాత గాంధీభవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే. ఇటీవల నేతలతో వరుస భేటీ నిర్వహించి.. అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన... హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం మరోసారి హైదరాబాద్ కు వచ్చారు. గాంధీ భవన్ లో 3 రోజుల పాటు వరుస భేటీలు నిర్వహించనున్నారు. గత పర్యటనలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసిన ఠాక్రే... గాంధీ భవన్ కు రావాలని ఆహ్వానించారు. ఇందుకు ఒప్పుకోని కోమటిరెడ్డి... బయట కలుస్తానని చెప్పారని సమాచారం. అయితే... తర్వాతి పర్యటనలో తప్పనిసరిగా రావాల్సిందే అని ఠాక్రే కోరడంతో... ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హల్ చల్ చేశారు. జై కోమటిరెడ్డి అంటూ నినదించారు.

వచ్చీ రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఠాక్రేతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారనే వార్తలు వచ్చాయి. అయితే అన్ని అంశాలపై చర్చిద్దామని, నేతలందరికీ సముచిత స్థానం, గౌరవం లభించేలా చూస్తానని ఠాక్రే హామీ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో.. కోమటిరెడ్డి గాంధీ భవన్ కు రావడం, రేవంత్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అనంతరం... మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయిన వెంకట్ రెడ్డి... పీసీసీ కమిటీలో తాను చెప్పిన పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీలో సరైన గౌరవం దక్కాలని.. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలని చెప్పినట్లు సమాచారం.

అంతకముందు.. గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నా వంతు సూచనలు, సలహాలు ఇస్తానని చెప్పారు. గాంధీ భవన్ మెట్లక్కనన్నారుగా అనే ప్రశ్నకు.. నేను ఎప్పుడూ అలా చెప్పలేదని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ తోనే ఉన్నాను... కాంగ్రెస్ జెండాతోనే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

మరోవైపు... ఠాక్రేను కలిసేందుకు గాంధీ భవన్ కు వచ్చిన సీనియర్ నేత వీ హన్మంతరావు.. కొద్దిసేపటికే అలిగి వెళ్లిపోయారు. క్రికెట్ టోర్నమెంట్ కు ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీ భవన్ కు వచ్చారు. అయితే.. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. బీజీ షెడ్యూల్ వల్ల ఠాక్రే రాలేరని మహేశ్ కుమార్ చెప్పడంతో... ఇంఛార్జి వస్తానని చెప్పినా నువ్వెందుకు అభ్యంతరం చెబుతున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు సమాచారం. అనంతరం బయటికి వచ్చిన వీహెచ్... కార్యక్రమంపై పీసీసీ అధ్యక్షుడు ఏమనట్లేదు కానీ... మహేశ్ కుమార్ మాత్రం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే లీడర్లు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా.. ఇవాళ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో ఇంఛార్జి ఠాక్రే భేటీ అవుతున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై నేతలతో చర్చిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. శనివారం జీ9 నేతలతో సమావేశమై... వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా నేతలతోనూ ఠాక్రే భేటీ కానున్నారు. అభిప్రాయాలు వెల్లడించేందుకు నేతలందరికీ ఠాక్రే తగిన సమయం ఇస్తున్నారని.. వారు చెప్పిన విషయాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు... ఠాక్రే వచ్చిన తర్వాత.. పార్టీలో నేతలు నెమ్మదిగా ఒకే లైన్ పైకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తొలిసారి సమావేశాల తర్వాత నేతలెవరూ బహిరంగంగా మాట్లాడలేదని... రెండోసారి సమావేశాలకు ఏడాదిగా గాంధీ భవన్ వైపు చూడని వారు కూడా రాష్ట్ర పార్టీ కార్యలయానికి వస్తున్నారని... పార్టీకి ఇది శుభపరిణామమని పేర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గతంగా నెలకొన్న ఇబ్బందులు త్వరలోనే పూర్తిగా సద్దుమణుగుతాయని.... ఐక్యంగా పోరాటాలు చేసి అధికారంలోకి వస్తామని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner