Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఏ క్షణమైన ఎన్నికలకు వెళ్లే అవకాశం.... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణమైన ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలని చెప్పారు. ఎన్నికల కోసం చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రేకు సమగ్రంగా వివరించానని పేర్కొన్నారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఏ క్షణమైన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే.. సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే ను కలిసిన ఆయన... పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఠాక్రే ఆహ్వానం మేరకు వచ్చి కలిశానని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని... పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పానని పేర్కొన్నారు. 50 నుంచి 60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలని.. వారం, పది రోజులముందు అభ్యర్థులను ప్రకటిస్తే ఉపయోగం ఉండదని వివరించానని తెలిపారు.
కార్యకర్తల్ని పోరాటానికి సిద్ధం చేయాలని.. వచ్చే ఆరు నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలని ఠాక్రేకు తెలిపానన్నారు... వెంకట్ రెడ్డి. గాంధీ భవన్ మీటింగ్ లు తగ్గించి ప్రజల్లో ఉండాలని చెప్పానని వివరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి.. పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్ లో తక్కువగా ఉండాలని... జిల్లాల్లో మీటింగ్ లు పెట్టాలని సూచించానని చెప్పారు. అందుకు ఠాక్రే ఒప్పుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డీసీసీ అధ్యక్షులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు వెంకట్ రెడ్డి. పార్టీలో భేదాభిప్రాయాలు సర్వసాధారణం అన్న ఆయన... ఎన్నికల్లో గెలుపు కోసం అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
"పార్టీ పదవులు, కమిటీల గురించి ఠాక్రేతో మాట్లాడలేదు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్నే చెప్పా. ప్రభుత్వంపై పోరాటాలు చేయాలి. నిరుద్యోగ భృతి, డీఎస్సీ వంటి సమస్యలు ఉన్నాయి. పార్టీ వాటిపై పోరాడితే నిరుద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. అభిప్రాయ భేదాలు అన్ని పార్టీల్లో ఉంటాయి. అవి కామన్. కాంగ్రెస్ లో అంతా కలిసే ఉన్నాం. సీనియర్లకు ఐదు జిల్లాలకు ఒకరు చొప్పున ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించాలి. తద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ ఠాక్రేకు వివరించా" అని వెంకట్ రెడ్డి అన్నారు.
అంతకముందు.. ఇక గాంధీ భవన్ మెట్లెక్కను అని గతంలో ప్రకటించిన వెంకట్ రెడ్డి.. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం... రేవంత్ రెడ్డితో భేటీ కావడం... ఇద్దరూ ఉత్సాహంగా కాసేపు ముచ్చటించడం... అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.