తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress Troubles: సమస్యలు ఇలాగే ఉంటాయా? ఇక టీ కాంగ్రెస్ తీరు ఇంతేనా?

Telangana Congress Troubles: సమస్యలు ఇలాగే ఉంటాయా? ఇక టీ కాంగ్రెస్ తీరు ఇంతేనా?

HT Telugu Desk HT Telugu

15 February 2023, 19:35 IST

    • Telangana Congress News: ఆయన పార్టీలో సీనియర్ నేత...! సిట్టింగ్ ఎంపీ కూడా..! అందులోనూ స్టార్ క్యాంపెయినర్..! ఓవైపు పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్న వేళ... పొత్తులంటూ చేసిన కామెంట్స్... తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కట్ చేస్తే... ఎన్నికల ఏడాది వేళ లైన్ లోకి వస్తున్న క్రమంలో... ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. అంతేకాదు మొత్తం పార్టీనే డిఫెన్స్ లో పడేశాయి. మరోవైపు కాషాయదళానికి సరికొత్త ఆయుదాన్ని వారే అందించినట్లు అయింది. ఫలితంగా టీ కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు, నేతల మధ్య సఖ్యత, పార్టీ భవిష్యత్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త వివాదం
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త వివాదం

తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త వివాదం

TPCC Internal Fight: తెలంగాణ కాంగ్రెస్.... ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కుదిపేస్తూనే ఉంటుంది. నేతల మధ్య పంచ్ డైలాగ్ లు పేలుతూనే ఉంటాయి. అంతలోనే కలుస్తారు.. మరోవైపు గట్టిగా విమర్శలు గుప్పిస్తుంటారు..! ఏది చేసినా వారికే చెల్లుతుంది. సేవ్ కాంగ్రెస్ వివాదం కాస్త... ఇంఛార్జ్ మార్పు వరకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇంతలోనే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వేళ... అసమ్మతి నేతగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి పెద్ద బాంబునే పేల్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ వస్తుందని...కాంగ్రెస్ తో కేసీఆర్ కలవక తప్పదంటూ కామెంట్స్ చేశారు. ఇది కాస్త... పార్టీలో పెద్ద గందరగోళానికే దారి తీసింది. దాదాపు సొంత పార్టీ నేతలంతా... కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య పొత్తు పొడుస్తుందా..? నిజంగానే కాంగ్రెస్ కు కేసీఆర్ దగ్గరవుతున్నారా..? తాజా రాజకీయ పరిస్థితులు బీజేపికి బ్రహ్మస్త్రంగా మారనున్నాయా..? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు మారవా..? నేతల తీరు ఇంతేనా..? అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరగుతుందో అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

"కష్టాలు, బాధలు, దుఃఖాలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి" అంటూ Hamlet అనే డ్రామా ద్వారా షేక్ స్పియర్ ప్రస్తావిస్తాడు. సరిగ్గా ఈ మాటలే ప్రస్తుతం టీ కాంగ్రెస్ లోని పరిస్థితులకు అద్దంపట్టినట్లే అనిపిస్తోంది. సింపుల్ గా మాస్ గా మన భాషలో చెప్పాలంటే... మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లే ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. అంటే ఓ సమస్య సెటిల్ అయింది అనుకునే లోపే మరో సమస్య తయారై కూర్చోవటం... నేతలంతా ఒక్కొక్కరిగా లైన్ లోకి వస్తున్నారనే సమయంలోనే..పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్స్ చేయటం వంటివి తెరపైకి వస్తుండటంతో పార్టీ మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితికి వచ్చింది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. వీటిని కాస్త లోతుగా చూస్తే.... కరెక్ట్ గా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు.

నిజానికి దశాబ్ధాల స్వరాష్ట్ర ఆకాంక్ష(తెలంగాణ ఏర్పాటు)ను నిజం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసింది హస్తం పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు దక్కినప్పటికీ... తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్(టీఆర్ఎస్) కే పట్టాం కట్టారు తెలంగాణ ప్రజలు. 2018లోనూ గతం కంటే భారీ పరాభవమే ఎదురైంది. బీఆర్ఎస్ బంపర్ విక్టరీ కొట్టింది. సీన్ కట్ చేస్తే...ఈసారి ఎలాగైనా(2023 ఎన్నికలు) పవర్ లోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్. అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ... ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది. ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామనే ధీమాను కేడర్ లోకి తీసుకెళ్తోంది. ఆ దిశగానూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కట్ చేస్తే... సొంత పార్టీ ఎంపీ, కీలక నేతగా పేరున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(భువనగిరి ఎంపీ) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి(కాంగ్రెస్ సహా) స్పష్టమైన మెజార్టీ రాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే సదరు నేత.. ఓ విషయాన్ని చెప్పకనే క్లియర్ కట్ గా చెప్పేశారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా డైరెక్ట్ గా పవర్ లోకి వచ్చే పరిస్థితి లేదనటంలోనే... అసలు విషయం అర్థమవుతోంది. సొంత పార్టీ నేతనే కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదంటూ మాట్లాడటం పెద్ద చర్చకే దారితీసినట్లు అయింది.

బీజేపీకి సరికొత్త అస్త్రం...!

ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్(పొత్తు)ను సొంత పార్టీ నేతలు(జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా) తీవ్రంగానే ఖండించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ కౌంటర్ ఇచ్చేశారు. అధినాయకత్వం కూడా సీరియస్ అయినట్లే తెలుస్తోంది. ఈ పరిణామాలతో తాను చేసిన కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నారు కోమటిరెడ్డి. తన కామెంట్స్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా... అప్పటికే బీజేపీకి సరికొత్త అస్త్రం చేతికి అందినట్లు అయింది. సరిగ్గా ఈ కామెంట్స్ ను ఆయుధంగా చేసుకుంటున్న కాషాయదళ నేతలు... బీఆర్ఎస్ - కాంగ్రెస్ పొత్తు బట్టబయలు అయిదంటూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పని అయిపోయిందంటూ సొంత పార్టీ నేతనే ఒప్పేసుకున్నారంటూ అస్త్రాలను సంధిస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ను గట్టిగానే కార్నర్ చేస్తున్నారు.

నిజానికి మొన్నటి వరకు టీపీసీసీ నాయకత్వంపై తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు కోమటిరెడ్డి. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా చేసిన ఈ కామెంట్స్ మాత్రం... పార్టీ పరిస్థితినే తలకిందులు చేసే వరకు తీసుకువచ్చారనే చర్చ జోరుగా నడుస్తోంది. ఆయన మాటలు సొంత పార్టీ వరకే పరిమితం కాలేదు... తెలంగాణలో పాగా వేయాలని చేస్తున్న బీజేపీకి ఓ రకంగా మేలు చేసే విధంగా అయింది. ఓవైపు సీనియర్లు, జూనియర్లు అనే విబేధాలను పక్కనపెట్టి మరీ... పవర్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. కానీ తాజా పరిణామం మాత్రం మొత్తం పార్టీని బోల్తా కొట్టించినట్లు అయింది. ఫలితంగా వ్యూహాలు రచించే పని బీజేపీకి లేకుండానే... కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న తప్పిదాలే వారికి సరికొత్త అస్త్రాలుగా మారుతున్నాయనేది మాత్రం సుస్పష్టం. మరోవైపు జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అర్థమవుతోంది. బీజేపీకి రాజకీయంగా ఓ చక్కటి ఛాన్స్ దొరికిందనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్ లో గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్లు ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి... ఈ కామెంట్స్ పెద్ద దెబ్బగానే మారాయి. ఈ వ్యాఖ్యలు... వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అకాశం కూడా లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు... అధికారంలోకి వచ్చేందుకు పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు కూడా భంగం కలిగే అవకాశం కూడా ఏర్పడింది.

బలపరుస్తున్న కేసీఆర్ కామెంట్స్...

ఇక కోమటిరెడ్డి కామెంట్స్ వ్యవహారం నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు గట్టిగా తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేదికగా మాట్లాడిన కేసీఆర్... బీజేపీని కార్నర్ చేసే క్రమంలో... యూపీఏ హయాంలో ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ ను మెచ్చుకున్నారు. ఫలితంగా యూపీఏ పాలనకు మంచి మార్కులే వేసినట్లే అయింది. ఈ పరిణామం కూడా కోమటిరెడ్డి కామెంట్స్ కు కరెక్ట్ గా లింక్ అయింది. ఓ మాటలో చెప్పాలంటే... పొత్తులపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు గట్టి బలాన్నే చూకూర్చాయనే చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ మొత్తం వ్యవహరం కూడా బీజేపీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ... కోమటిరెడ్డి చేసిన కామెంట్స్... పార్టీ ఉనికికే(ప్రతిపక్ష హోదా) ప్రమాదం తెచ్చినట్లు అయింది..! అంతేకాదు ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు ఓ రకంగా బీజేపీకి స్పేస్ ఇచ్చినట్లే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాలను చూస్తే... టీ కాంగ్రెస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఓవైపు పార్టీలోని అంతర్గత సమస్యలను అధిగమించటం ఓ విషయమైతే... మరోవైపు రోజురోజుకూ విస్తరిస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేసే దిశగా ఇప్పుడిప్పుడే ముందుకు కదిలినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... మరోవైపు బలమైన ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ ను కూడా కొట్టేందుకు శంఖారావం కూడా పూరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరు ఓడిపోతారు..? ఎవరు గెలుస్తారు..? ఎవరి గెలుపునకు ఎవరు లాభం చేకూరుస్తారు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే సమయంలో....పార్టీకి చెందిన సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్ చేసిన ఈ తరహా వ్యాఖ్యలు అనాలోచితమనే చెప్పొచ్చు. అంతేకాదు... పుంజుకునే ప్రయత్నంలో ఉన్న పార్టీకి బ్రేక్ లు వేసినట్లే అని స్పష్టమవుతోంది కూడా..! ఈ ప్రభావం ఏదో గాంధీ భవన్ వరకే కాదు... పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే పరిస్థితులకు ఓ ఇండికేషన్ అని కూడా అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత పరిణామాల మధ్య కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. గతంలో ఇదే కాంగ్రెస్ తో ముప్పు పొంచి ఉంటుందనే భయంతోనే బీజేపీ ఎదుగుదలకు కేసీఆర్ సాయపడ్డారనే విషయం కూడా కాంగ్రెస్ నేతలకు తెలుసు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో... పొత్తులపై ఏదైనా ఒక ప్రచారం బయటికి వస్తే బీజేపీకి ఆయుధంగా మారినట్లే అవుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందేశాల ఫలితంగా... ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న భావన కూడా రాష్ట్రంలో క్రియేట్ అవుతోంది. ఇది కాస్త బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నంత వరకు వెళ్తుందనే విషయాన్ని కూడా సదరు నేతలు గ్రహించాల్సి ఉంటుందని చెప్పొచ్చు.

నిజానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను తలదన్నే రీతిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన సమయంలో... వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ పార్టీ నిస్సహాయతకు అద్దంపడుతున్నాయి. అంతేకాదు మరోసారి అంతర్గత పోరును కూడా బట్టబయలు చేసుకున్నట్లు అయింది. ఓ విధంగా చూస్తే... కాంగ్రెస్ పార్టీ ప్లేస్ ను దాదాపు బీజేపీ రిప్లేస్ చేసిందని వాదన కూడా ఇప్పటికే ఉంది. బీఆర్ఎస్ ను ఎదుర్కొవటంతో పాటు సమస్యలపై పోరాడే విషయంలో పలు అంశాలను కాంగ్రెస్ విస్మరించిదనే చెప్పొచ్చు. పైగా సీనియర్ నేతల ప్రకటనలు, కామెంట్స్ మాత్రం...పార్టీకి ఉపయోగపడకుండా... ఓ రకంగా బీజేపీకి ఆయుధాలుగా మారుతుండటం కూడా హస్తం అధినాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు అయింది.

పార్టీలో అంతర్గత పోరు, హంగ్ కామెంట్స్ పై ప్రస్తుతం చర్చ నడుస్తున్న నేపథ్యంలో... ఇప్పటికే ఓటర్లు ఏదో ఒకవైపు చూస్తున్నారనేది కాంగ్రెస్ లోని నేతలు అర్థం చేసుకోకవపోచ్చు. ఇదే సమయంలో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే స్థాయికి కాంగ్రెస్ ను తీసుకురావటం నేతలకు ఓ సవాల్ లాంటిదే అని కూడా చెప్పొచ్చు. ఇదే టైమ్ లో యూపీఏ కూటమికి కేసీఆర్ లవ్ సిగ్నల్స్ ఇవ్వటం...ఎంపీ కోమటిరెడ్డి పొత్త అంటూ కామెంట్స్ చేయటం వంటివి కాంగ్రెస్ పార్టీని తిరోగమనంవైపు తీసుకెళ్తున్నట్టు అయిందనే అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని ఆ పార్టీ నాయకత్వం ఎలా అధగమిస్తుందనేది మాత్రం ఆసక్తకరంగా మారింది.

ఓవరాల్ గా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ను ఇలా ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నట్లు అనిపిస్తోంది! చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ డౌట్ రాకమానదు. కారణం... పరిస్థితులు అలా ఉన్నాయి. ఓవైపు అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి కూడా తెలిసిందే. వాటిని పక్కనపెట్టి ఇప్పుడిప్పుడే లైన్ లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సదరు నేత చేసిన కామెంట్స్ తో గట్టి గండి పడినట్లే అయిందంటూ విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులను టీ కాంగ్రెస్ నాయకత్వం ఎలా అధిగమిస్తుంది..? బీఆర్ఎస్, బీజేపీలను ఢీకొట్టి అధికారంలోకి వస్తుందా..? లేదా ఉన్న ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీకి అప్పగించి.. పోటీ నుంచి జారుకుంటుందా..? అనేది చూడాలి…..!

తదుపరి వ్యాసం