Revanth Reddy Padayatra : బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయింది... రేవంత్-revanth reddy slams brs and bjp during padayatra 8th day in bhadrachalam constituency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Padayatra : బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయింది... రేవంత్

Revanth Reddy Padayatra : బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయింది... రేవంత్

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 10:01 PM IST

Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర 8వ రోజు.. భద్రాచలం నియోజకవర్గానికి చేరుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వీ హన్మంతరావు... రేవంత్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.

భద్రాచలంలో కాంగ్రెస్ పాదయాత్ర
భద్రాచలంలో కాంగ్రెస్ పాదయాత్ర

Revanth Reddy Padayatra : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని విమర్శించారు. 9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రూ. 23 లక్షల కోట్లు ఖర్చు చేశారని... ఇందులో అత్యధిక శాతం కమీషన్ల రూపంలో కల్వకుంట్ల కుటుంబం జేబుల్లోకే పోయాయని ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర 8వ రోజు భద్రచాలానికి చేరుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వీ హన్మంతరావు... రేవంత్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం ఆలయం గుర్తింపు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పట్టణాన్ని కుట్రలతో మూడు ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. భద్రాచలం ఆలయానికి ఇస్తామన్న రూ.100 కోట్లు ఏమయ్యాయని నిలదీసిన ఆయన.... రూ. 1000 కోట్లతో గోదావరి ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారని.. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వరద బాధితులకి ఇస్తామన్న రూ. 10 వేలు కూడా ఇవ్వలేదని... సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకి పరిహారం అందలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదని.... ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను పూర్తిగా విస్మరించారన్నారు. రుణమాఫీ పూర్తి చేయకుండా రైతులని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని... డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడగబోదని... ఈ సవాల్ కి కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న బీజేపీ విమర్శలపై రేవంత్ ఫైర్ అయ్యారు. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. బోడి గుండు మీద జుట్టు వచ్చేది లేదు... తెలంగాణలో బీజేపీ వచ్చేది లేదని ఎద్దేవా చేశారు. మీరెంత, మీ పార్టీ ఎంత అని బీజేపీ నేతలపై రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.... భాషలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతోందని... విభజించు, పాలించు విధానంతో అధికారాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు.

2024 కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని...ప్రతి పేద రైతుకి ఎకరానికి రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని... రూ. 5 వేల ఫీజు రియంబర్స్ మెంట్... రూ. 800 ఆరోగ్య శ్రీ బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతామని తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 500 కే అందిస్తామన్నారు. అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కలిసిన గ్రామాల్లో ఐదింటిని వెనక్కి తీసుకోవాలని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రంతో మాట్లాడి ఆ పని పూర్తి చేస్తామని అన్నారు.

భద్రాచలం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ భద్రాచలానికి చేసిందేమి లేదన్నారు. డిగ్రీ కాలేజీ, కరెంట్, ఆసుపత్రులు, ఐటీడీఏ, గోదావరి నదిపై బ్రిడ్జి కట్టింది, మంచినీటి సదుపాయాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని భట్టి గుర్తుచేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చామని గుర్తు చేశారు. 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని.... పేదలకు పక్కా ఇళ్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులే కాదు.. నియామకాలు లేవని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని ఏపీలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమానికి సంబంధించి తన పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను త్వరలోనే ప్రకటించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

IPL_Entry_Point