Etela Rajender : కేసీఆర్ మాటలకు పడిపోను… ఈటల రాజేందర్-bjp mla etela rajender says he won t fall for cm kcr words in assembly sessions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Etela Rajender : కేసీఆర్ మాటలకు పడిపోను… ఈటల రాజేందర్

Etela Rajender : కేసీఆర్ మాటలకు పడిపోను… ఈటల రాజేందర్

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 08:08 PM IST

Etela Rajender : అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగంలో కేసీఆర్ పలుమార్లు ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించడం.. చర్చనీయాంశమైంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా ? అనే ప్రచారం మొదలుకాగానే... ఈ అంశంపై ఈటల స్పందించారు. కేసీఆర్ మాటలకు తాను పొంగిపోనని... పార్టీ మారే కల్చర్ తనకు లేదని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (facebook)

Etela Rajender : తెలంగాణలో గత ఏడాదిన్నరగా.. బీఆర్ఎస్ లీడర్లు.. ఈటల రాజేందర్ మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్... ఆ తర్వాత ఈటల బీజేపీలో చేరిక.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తర్వాత నుంచి... రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు, ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. గతంలో రెండు సార్లు అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటలను బహిష్కరించారు కూడా. దీంతో... అసెంబ్లీలో తన ముఖం చూడటం ఇష్టం లేకే కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించారు. తాజా.. అసెంబ్లీ సెషన్స్ వరకూ వీరిమధ్య వైరం ఇలాగే కొనసాగుతూ వచ్చింది.

అయితే... తాజా పరిణామాలు చూస్తుంటే... బీఆర్ఎస్ హఠాత్తుగా ఈటల పట్ల తమ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చలో ఈటలకు మాట్లాడే అవకాశం కల్పించడమే కాకుండా.. ఆఖరి రోజు కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు రాజేందర్ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా... డైట్ ఛార్జీలు పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్తావించారు. ప్రస్తుత ఛార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదని.. వాటిని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించిన కేసీఆర్... డైట్ ఛార్జీలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రులను ఆదేశించిన కేసీఆర్... ఛార్జీలు పెంచేటప్పుడు ఈటల రాజేందర్ కు కూడా ఫోన్ చేసి మాట్లాడాలని సూచించారు. ఈటల రాజేందర్‌ ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామని... సమస్యలు ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ అన్నారు. ఈటల పేరు ప్రస్తావిస్తూ... కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో... ఈటల మళ్లీ బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. కేసీఆర్ తన పేరు ప్రస్తావించడం పట్ల స్పందించిన ఈటల... తనను ఇబ్బంది పెట్టే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడి ఉంటారని అన్నారు. తన చరిత్ర తెలిసిన వారెవరూ ఇట్లాంటి మాటలు నమ్మరని తేల్చి చెప్పారు. అసెంబ్లీకి రాకుండా రెండు సార్లు అడ్డుకున్నప్పుడు తానేమీ కుంగిపోలేదని... ఇవాళ ప్రస్తావించిన సమస్యలకు సానుకూలంగా స్పందించినంత మాత్రాన పొంగిపోనని స్పష్టం చేశారు. తన మీద చేసిన దాడి, పెట్టిన ఖర్చు.. సృష్టించిన ఇబ్బందులు ఇప్పటికీ మరువలేనివని అన్నారు. పార్టీలు మారే కల్చర్ తనకు లేదన్న ఆయన... ఎక్కడ ఉన్నా సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు చర్చలకు పిలిస్తే వెళతానని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటే... మాట్లాడటానికి సిద్ధమని తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చెప్పిన లెక్కల్లో సగానికి సగం తప్పులే ఉన్నాయన్నారు ఈటల. కరోనా విలయం.. ప్రపంచ వ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని భారత్ నిలబడిందంటే అది ప్రధాని మోదీ పనితీరు వల్లేనని... ఇది ముమ్మాటికీ బీజేపీ ఘనతే అని అన్నారు. తెలంగాణలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారని ప్రశ్నించారు. 12వ తేదీ వచ్చినా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉద్యోగులకి జీతాలు రాలేదని... ఇది తెలంగాణలో ఉన్న దుస్థితికి నిదర్శనమన్నారు. రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. 50 వేల కోట్ల లెక్కలు పూర్తిగా తప్పుడు లెక్కలేనని.. సాధ్యాసాధ్యాలు వదిలేసి.. గొప్పలు చెప్పుకునేందుకు ప్రభుత్వం పాకులాడుతోందని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు, పార్టీల మధ్య మాట్లాడుకోనివ్వని పరిస్థితి మంచిది కాదని... సంకుచిత మనస్తత్వం ఉండొద్దని... రాజకీయాల్లో ఉన్న వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని ఈటల రాజేందర్ హితవు పలికారు.

Whats_app_banner