T Congress Govt Six Guarantees : కాంగ్రెస్ సర్కార్ ‘ఆరు గ్యారెంటీల’ లక్ష్యాలు ఇవే.!
26 December 2023, 18:27 IST
- TS Congress Six Guarantees : ఆరు గ్యారెంటీల హామీలను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించే పనిలో ఉంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈ ఆరు గ్యారెంటీల లక్ష్యాలెంటో ఇక్కడ చూడండి….
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్
TS Congress Six Guarantees : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయదలచిన ఆరు గ్యారెంటీల లక్ష్యాలను, వాటి అమలుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఒకసారి పరిశీలిద్దాం.
- ప్రజలకు చేరువగా పరిపాలనను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని 28వ తేదీ నుంచి లాంచనంగా చేపడుతోంది. ఆరోజున దరఖాస్తుల శ్వీకరణను ప్రారంభించి 6వ తేదీ వరకు స్వీకరిస్తారు.
- రాష్ట్రంలోని అర్హులైన, నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాలవ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఆరు గ్యారెంటీల రూపంలో అందజేయడం.
- క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించి, మెరుగైన పరిపాలనను ప్రత్యేకించి నిరుపేద, అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం.
- గడచిన పదేళ్లుగా ప్రజలకు దూరమైన పరిపాలనను వారి ముంగిట్లోకి తీసుకొచ్చి వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆరు గ్యారెంటీలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడటం.
- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక సాధికారతలను చేకూర్చేలా గట్టిగా ప్రయత్నించడం.
ప్రతి నాలుగు నెలలకోసారి..
ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు తలపెట్టిన ప్రజా పాలన కార్యక్రమం ఈనెల 28న ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో ప్రారంభం అవుతుంది. జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుందని అందరూ భావిస్తున్నారు. కాగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రజా పాలన కార్యక్రమం 8 పని దినాల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వ సెలవు దినాలు ఇందుకు మినహాయింపు.
ఎక్కడ నిర్వహిస్తారంటే..?
ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలోని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రతి మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకం దరఖాస్తులు స్వీకరిస్తారు.
మండల స్థాయిలో అవసరమైనన్ని అధికార బృందాలను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి 6వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి చేసుకోవాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్డు స్థాయిలో అవసరమైనన్ని బృందాలను ఇప్పటికే నియమించారు. ప్రతి బృందం గ్రామసభ కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అధికార బృందాల్లో ఉండేది వీరే..
ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అధికార బృందాలను నియమించింది. తహసిల్దారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, పౌరసరఫరాల శాఖ ప్రతినిధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి, మండల విద్యాశాఖ అధికారి, ట్రాన్స్ కో తో పాటు సంబంధిత గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఇతర సంబంధిత అధికారులను ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రభుత్వం నియమించింది. పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల ప్రతినిధులతో కూడిన బృందాలను నియమించారు.
క్షేత్రస్థాయి అధికారి బాధ్యతలు ఇవే..
సదస్సుకు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామాల ఇన్చార్జి అధికారి లేక మున్సిపల్ వార్డు ఇన్చార్జి అధికారులు ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తాగు నీరు, షామియానా వంటి వసతులను సమకూర్చాలి. అంతకు ముందు రోజే దరఖాస్తులను పంపిణీ చేసి దరఖాస్తుదారులు వాటిని నింపి సిద్ధంగా ఉండేలా అవగాహన కల్పించాలి. ఇతర గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామపంచాయతీ అయితే సర్పంచ్, మున్సిపల్ పరిధి అయితే కార్పొరేటర్ ను, ఇతర ప్రజా ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించాలి. సభ ప్రారంభించడానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాల్సి ఉంటుంది.
రశీదు ఇవ్వాల్సిందే..
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉన్న సిబ్బంది దరఖాస్తుల స్వీకరణను సంపూర్ణంగా పూర్తి చేయాలి. అవసరమైన వివరాలను నింపారో.. లేదో చూసుకుని సంబంధిత పత్రాలను లబ్ధిదారులు సమర్పించేలా చూసుకోవాలి. అనంతరం వారికి రశీదును తప్పనిసరిగా అందజేయాలి. స్వీకరించిన దరఖాస్తులను పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో నమోదు చేయాలి. ఆ తర్వాత ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించాలి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.