Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత, ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ- మంత్రి పొంగులేటి
Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హతని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
Six Guarantees :ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తెచ్చింది. ఆరు గ్యారంటీల అమలుపై మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు అర్హతతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు.
ఈ నెల 28 నుంచి ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు
ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లను ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆరు గ్యారంటీలు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. గ్రామసభల్లో అర్హులు అధికారులకు దరఖాస్తులు అందజేయాలన్నారు. ప్రజలు నుంచి దరఖాస్తులను తీసుకున్న తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారన్నారు. అధికారులే గ్రామాలకు వెళ్లి అప్లికేషన్లు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాత లబ్దిదారులను అధికారులు నిర్ణయిస్తారన్నారు. కొన్ని గ్రామాలు దూరంగా ఉన్నాయని, అలాంటి ప్రాంతాలకు అధికారులే వెళ్లాలన్నారు.
కక్ష సాధింపు చర్యలు ఉండవు
పదేళ్ల తర్వాత తెలంగాణలో ప్రజా పాలన మొదలైందని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వంలో అధికారుల సూచనలు, అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదని ఆరోపించారు. అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు. డ్రగ్స్ అరికట్టడంలో ఐపీఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ధరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరణి పేరుతో గత ప్రభుత్వంలో కొందరు భూములు వారి పేరుతో రిజిష్టర్ చేసుకున్నారన్నారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. చాలా ఏళ్ల తర్వాత అధికారులు స్వతంత్రంగా మాట్లాడారన్నారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. కానీ తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారన్నారు. ధరణిపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను 6 లక్షల అప్పుల్లో ముంచారన్నారు. విద్యుత్ రంగంలో రూ.81 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలే ఒప్పుకున్నారన్నారు.