TSPSC Group 2 Exam : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా....? అప్పటివరకు అంతేనా..!-tspsc group 2 exam likely to be postponed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 2 Exam : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా....? అప్పటివరకు అంతేనా..!

TSPSC Group 2 Exam : తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా....? అప్పటివరకు అంతేనా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 26, 2023 03:26 PM IST

TSPSC Group 2 Exam Updates : తెలంగాణలో మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎగ్జామ్స్ తేదీలు ఖరారు కాగా… ఏర్పాట్ల విషయంలో టీఎస్పీఎస్పీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో పరీక్ష నిర్వహణపై క్లారిటీ లేకుండా పోయింది.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష
తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష

TSPSC Group 2 Exam Updates: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన పరీక్ష జరగాల్సి ఉండగా.. ఇంకా పరీక్షకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి కారణాలు లేకపోలేదు… ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా పలువురు సభ్యులు ఇటీవలే రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్ష తేదీలు… దగ్గరపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఏర్పాట్లకు సంబంధించి కమిషన్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో… పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమనషన్. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ.

ఇంతలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో… పేపర్ లీక్ కేసుపై దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని భావించిన సర్కార్… ఛైర్మన్ తో పాటు సభ్యులను రాజీనామా చేసే దిశగా చర్యలు తీసుకుంది. సర్కార్ ప్రయత్నాల నేపథ్యంలో… కమిషన్ లోని సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఛైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను ఖరారు చేసి… గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. వీరి నియమకాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. దీంతో ఈ ప్రక్రియంతా పూర్తి కావటానికి సమయం పట్టే అవకాశం ఉంది.

కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాకే… గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner