CM Revanth Reddy : అన్ని గ్రామాల్లో 'ప్రజా పాలన' సభలు - కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
24 December 2023, 13:29 IST
- Telangana Govt Latest News: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి
Telangana Govt Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం ప్రారంభమైంది. ఈ కీలకమైన సమావేశానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ భేటీలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు సభల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన…. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. మహాలక్ష్మి, కొత్త రేషన్ కార్డులు, ధరణి పోర్టల్ పై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
శనివారం ఆటో డ్రైవర్లుతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… గిగ్ వర్కర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్ కు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలుచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందాడు. బాధితుడి కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు పరిహారం అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసంఘటిత రంగాల్లో కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం... అసంఘటిత కార్మికులకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజస్థాన్ అమలు చేస్తున్న చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సంస్థలు కూడా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు.