TPCC New Incharge : తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ - ఏపీకి మాణిక్కం ఠాగూర్‌-deepa das munshi new incharge for telangana congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc New Incharge : తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ - ఏపీకి మాణిక్కం ఠాగూర్‌

TPCC New Incharge : తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ - ఏపీకి మాణిక్కం ఠాగూర్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 24, 2023 07:06 AM IST

Telangana Congress Latest News : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రాష్ట్రాల ఇంఛార్జులను మార్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇంఛార్జుగా ఉన్న ఠాక్రే స్థానంలో… దీపాదాస్‌ మున్షీని నియమించింది. ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ పేరును ఖరారు చేసింది.

దీపాదాస్‌ మున్షీ
దీపాదాస్‌ మున్షీ

TPCC New Incharge Deepa Das Munshi: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీని నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను… గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌ పేరును ఖరారు చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన దీపాదాస్‌ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌హారాష్ట్ర మాజీ పీసీసీ అధ్య‌క్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను… తెలంగాణ ఇన్‌చార్జీగా నియ‌మించింది కాంగ్రెస్. ఠాక్రేకు ముందు ఇన్‌చార్జిగా ప‌ని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్‌ పై అనేక విమర్శలు రావటంతో తొలగించాల్సి వచ్చింది. ప్రధానంగా… పీసీసీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్లు పదే పదే ఫిర్యాదు చేయటం ఇందుకు కారణమైంది. పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి దక్కటంలోనూ… కీలకంగా వ్యవహరించారనే వార్తలు కూడా వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో… ఠాకూర్ ను మారుస్తూ ఠాక్రేను నియమించింది కాంగ్రెస్.

పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. ఈమె మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పని చేయగా… ప్రస్తుతం ఇంఛార్జ్ బాధ్యతలను కట్టబెట్టింది హైకమాండ్.

మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… వచ్చే లోక్ సభ ఎన్నికలకు సీరియస్ గా తీసుకుంటుంది. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంఛార్జులను కూడా నియమించింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా సీతక్క, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జిగా శ్రీధర్‌బాబు, కరీంనగర్ పార్లమెంట్ ఇంఛార్జిగా పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా జీవన్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా పి.సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. మెదక్ పార్లమెంట్ ఇంఛార్జిగా దామోదర్ రాజనర్సింహ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల ఇంఛార్జిగా భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్‌నగర్ స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా సీఎం రేవంత్‌రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంఛార్జిగా జూపల్లి కృష్ణారావు, నల్గొండ పార్లమెంట్ ఇంఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జిగా కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంఛార్జులు… సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం కేడర్ ను సిద్ధం చేస్తున్నారు.

IPL_Entry_Point