తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Arunachalam Services : వేములవాడ టు అరుణాచలం స్పెషల్ బస్, గురు పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

TGSRTC Arunachalam Services : వేములవాడ టు అరుణాచలం స్పెషల్ బస్, గురు పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

HT Telugu Desk HT Telugu

07 July 2024, 22:15 IST

google News
    • TGSRTC Arunachalam Services : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గిరి ప్రదక్షిణతో పాటు పలు పుణ్య క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచింది.
వేములవాడ టు అరుణాచలం స్పెషల్ బస్, గురు పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
వేములవాడ టు అరుణాచలం స్పెషల్ బస్, గురు పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

వేములవాడ టు అరుణాచలం స్పెషల్ బస్, గురు పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

TGSRTC Arunachalam Services : అరుణాచలం వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధి నుంచి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈనెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని వేములవాడ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలివెళ్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించామని ఆర్ఎం తెలిపారు. ఈనెల 19న రాత్రి 8 గంటలకు వేములవాడ నుంచి బయలు దేరే బస్సు కరీంనగర్ మీదుగా 20న రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని వివరించారు.

ఈ బస్సులో వెళ్లే ప్రయాణికులు నేరుగా అరుణాచలానికి చేరుకోకుండా మార్గ మధ్యలో ఉన్న శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక, మహాలక్ష్మీ ఆలయాలతో పాటు గోల్డెన్ టెంపుల్ లను దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. అరుణాచల గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 21వ తేది సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న ఈ బస్సు శక్తిపీఠం గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారు దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 22న సాయంత్రం 6 గంటలకు బస్సు కరీంనగర్ మీదుగా వేములవాడ చేరుకుంటుందని తెలిపారు.

ముందస్తుగా రిజర్వేషన్

ప్రత్యేక బస్సులో వేములవాడ నుంచి అరుణాచలం వరకు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3800 బస్ ఛార్జీ ఉంటుందన్నారు. బస్ సర్వీసుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in లో సర్వీసు నెంబర్ 75555 ను ఎంపిక చేసుకొని ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం