TGRTC Buses: తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు, ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు-new buses for telangana rtc soon ac buses from every district to hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgrtc Buses: తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు, ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు

TGRTC Buses: తెలంగాణ ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు, ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు

Sarath chandra.B HT Telugu
Jul 03, 2024 06:52 AM IST

TGRTC Buses: తెలంగాణ ఆర్టీసీ కొత్తగా 2 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేస్తుంది. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో ఆర్టీసీకి త్వరలో 2వేల బస్సులు
తెలంగాణలో ఆర్టీసీకి త్వరలో 2వేల బస్సులు

TGRTC Buses: ఇకపై ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఏసి బస్సు, ప్రతి మండలం నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులు నడుపాలని సంకల్పించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం, రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే భారీగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని త్వరలో మరో 2 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. 33 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల సహకారం, ఉద్యోగుల శ్రమశక్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్టీసీ ముందుకు పోతుందన్నారు.

ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో 100% అక్యుపెన్సీ

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీ అక్యుపెన్సీ రేటు వందశాతం పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని చెప్పారు.

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రెవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో జరిగిన సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ఆర్టీసిని మరింత ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

త్వరలో 3035 ఉద్యోగాల భర్తీ

టిజిఆర్టీసిలో త్వరలో 3035 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డ్రైవర్, శ్రామిక్, మెకానిక్, సూపర్ వైజర్ వంటి పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.‌ త్వరలోనే ఆర్టీసీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పదేళ్ళ తర్వాత తొలిసారిగా ఆర్టీసీ లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాల క్రింద చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ

మహిళలకు ఉచిత ప్రయాణ రాయితీ ప్రభుత్వం చెల్లించడంతో ఆర్టీసి నష్టాల నుండి బయట పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని చెప్పారు. గతంలో తీసుకున్న అప్పులు, పిఎఫ్, కో అపరెటివ్ సెస్ తీర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

2013 నుంచి పెండింగ్ ఉన్న ఏరియల్స్ 280 కోట్ల పెండింగ్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తున్నామని..ఇప్పటికే 80 కోట్లు చెల్లించామని.. 200 కోట్లు ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆలస్యమైనా ప్రతి కార్మికుడికి చెల్లిస్తామని తెలిపారు. 21 శాతం పీఆర్సీ అమలు చేశామని చెప్పారు.

ఆర్టీసి తార్నాక హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ గా మరుస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఆర్టీసి అగ్రగామిగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన బస్ స్టాండ్ లను మరమత్తులు చేస్తున్నామని చెప్పారు.

(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)sa

Whats_app_banner