Karimnagar Politics : కరీంనగర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్- నేతల మధ్య మాటల యుద్ధం
Karimnagar Politics : కరీంనగర్ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిమయం అయ్యిందని కాంగ్రె ఆరోపిస్తుంటే... హామీల అమలు పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని బీఆర్ఎస్ అంటోంది.
Karimnagar Politics : కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయంగా దుమారం రేపుతుంది. నగరపాలక సంస్థ పనితీరుపై పరస్పర ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి నిలయంగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మేయర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ అటు మేయర్ సైతం ఘాటుగానే స్పందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నేతలు అనవసరమైన ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు.
అవినీతిపరుల భరతం పడతాం-రాజేందర్ రావు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి నిలయంగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వెలిగించాల రాజేందర్ రావు. పలువురు కాంగ్రెస్ కార్పోరేటర్స్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రిఫ్రాం కార్పొరేషన్, క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ ద్వారా అవినీతిని కడిగి వేయడం మా ధర్మం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. మేయర్ వై.సునీల్ రావు అమ్యామ్యాల సునీల్ రావుగా మారాడని విమర్శించారు. అవినీతి, అనకొండ సునీల్ రావు అని నగర ప్రజలు అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడూ ఇంత అవినీతి జరగలేదని ఆరోపించారు. నగరంలో ఎవరినోట ఉన్నా మేయర్ అవినీతి మాట వినిపిస్తోందని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ కరీంనగర్ పేరుతో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మేయర్ అవినీతి అక్రమాలను చాటి చెబుతామని స్పష్టం చేశారు. కార్పోరేషన్ అవినీతిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపిస్తామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన భూకబ్జాలు, ఎలాంటి అవినీతి జరిగిందని ఫిర్యాదు వస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధర్మం, ద్యేయమని స్పష్టం చేశారు.
అనవసరమైన ఆరోపణ చేస్తే ఖబడ్దార్- మేయర్ సునీల్ రావు
కాంగ్రెస్ విమర్శలపై మేయర్ వై.సునీల్ రావు ఘాటుగా స్పందించారు. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన సునీల్ రావు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి జై కొట్టే రాజేందర్ రావు గత చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మొన్నటి లోకసభ ఎన్నికల్లో క్యాడర్ లేక ఒక్కో కార్పొరేటర్ కు పది నుంచి పదిహేను లక్షలు ఇచ్చి కొనుక్కున్న చరిత్ర మీదని ఆరోపించారు. మూడుసార్లు ఓడిన బుద్ధి రానట్లు మా గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మీ తండ్రి జగపతిరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని లాక్కున్న నీచ సంస్కృతి నీదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లిచ్చేందుకు తమపై అనవసరమైన ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే హామీలు అమలుచేసి అవినీతి ఆరోపణపై ఎలాంటి విచారణ జరుపుకున్న తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించు... అనవసరమైన ఆరోపణ చేస్తే ఖబడ్దార్ అని రాజేందర్ రావు ను సునీల్ రావు హెచ్చరించారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం